చిత్తూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (సీడీసీఎంఎ్‌స)లో దుర్వినియోగమైన నిధులను 18 శాతం వడ్డీతో రికవరీ చేయాలని కలెక్టరు సుమిత్‌కుమార్ ఆదేశించారు. దీనికి బాధ్యులైన అప్పటి పాలకవర్గం నుంచే వసూలు చేయాలన్నారు. వివరాలిలా ఉన్నాయి. సీడీసీఎంఎస్ మాజీ చైర్మన్, ప్రస్తుత వైసీపీ నేత శ్యామరాజు గతంలో చైర్మన్‌గా వ్యవహరించారు. అప్పట్లో సొసైటీ పరిధిలో పాలకవర్గం అవకతవకలకు పాల్పడి నిధుల దుర్వినియోగం చేసిందని, వాటిపై విచారణ జరిపించాలని కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించాలని సహకార శాఖ అధికారులకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఆడిట్ రిపోర్టు ఆధారంగా రూ.12.85 లక్షల మేరకు సొసైటీ మాజీ చైర్మన్ అవినీతికి పాల్పడి, నిధులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఈయనతో పాటు ఇంకా అప్పటి పాలకవర్గ వైస్ చైర్‌పర్సన్ వరలక్ష్మి రూ.56,900, సభ్యులు నాగరాజు రూ.53,974, తిమ్మప్ప రూ.63,170, శ్రీనివాసులు రూ.34.640, సుబ్బమ్మ రూ.58,890, శంకరప్ప రూ.20,360, సొసైటీ మాజీ బిజినెస్ మేనేజర్ వెంకటమునిరెడ్డి రూ.23 వేల వరకు నిధుల దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. దుర్వినియోమైన నిధులను 18 శాతం వడ్డీతో వారి నుంచే రికవరీ చేయాలని సహకార శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. సర్‌ఛార్జీనోటీసులు జారీ చేసి వారిపై ఎగ్జిక్యూటివ్ పిటిషన్ దాఖలు చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.