విశాఖ స్టీల్‌ప్లాంటును బతికించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈనెల పదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్, సీఐటీయూ నాయకుడు సీహెచ్ నరసింగరావు తెలిపారు. జగదాంబ జంక్షన్‌లోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు వైసీపీ ప్రభుత్వం నిజాయితీగా పనిచేయలేదని విమర్శించారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తిని 73 లక్షల టన్నుల నుంచి 45 లక్షల టన్నులకు తగ్గించిందన్నారు. ఐదు వేల మందికిపైగా కాంట్రాక్టు కార్మికులను తొలగించిందన్నారు. అదేవిధంగా ఐదు వేల మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్ ద్వారా తగ్గించగా, మరో 1,500 మందిని బయటకు పంపించేందుకు రూ.1261 కోట్లు కేటాయించిందన్నారు. స్టీల్‌ప్లాంటుకు అవసరమైన ముడిసరకు కొనడానికి డబ్బుల్లేవని చెబుతున్న యాజమాన్యానికి...ఉద్యోగులను వీఆర్‌ఎస్ కింద బయటకు పంపించడానికి డబ్బులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు మణిహారంగా ఉన్న స్టీల్‌ప్లాంటును కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. స్టీల్‌ప్లాంటు పరిరక్షణ కోసం ఈనెల పదో తేదీ ఉదయం పది గంటల నుంచి 11 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే రాస్తారోకోలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు భాగస్వామ్యులవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేశారు.