వాయుగుండం ప్రభావంతో అతలాకుతలమైన ఎన్టీఆర్ జిల్లాకు అవసరమైన ఆహారం, మంచినీళ్ల బాటిళ్లు, మజ్జిగ, ఇతర నిత్యావసరాలను పంపేందుకు అవసరమైన చర్యలలో ఒంగోలు జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. సోమవారం మధ్యాహ్నం ఒక విడత వాహనాలలో పంపగా, రాత్రికి కూడా తరలించింది ఎన్టీఆర్ జిల్లాను గత మూడు రోజుల నుంచి వరద ముంచెత్తుతుండటంతో సమీపంలో ఉన్న ప్రకాశం జిల్లా నుంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా నేతృత్వంలో రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో అందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం పది గంటలకే ఎన్టీఆర్ జిల్లాకు 25వేల ఆహార పొట్లాలతోపాటు వాటర్ బాటిళ్లు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లను ప్రత్యేక వాహనాల్లో అధికారులు పంపారు. రాత్రికి మరో 50వేల ఆహార ప్యాకెట్లను పంపించారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను చేపట్టేందుకు జిల్లా నుంచి అధికారులు అక్కడికి వెళ్లారు. వారంతా ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముంపు బాధితుల కోసం బ్రెడ్లు లాంటి నిల్వ ఉండే ఆహార పదార్థాలను కూడా ప్రత్యేక వాహనాల్లో తరలించారు. కాగా బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.