కడప జిల్లా, వీరపునాయునిపల్లె మండల పరిధిలోని ఎన.పాలగిరి క్రాస్ గోనుమాకులపల్లె మార్గమధ్యంలో ఉన్న మొగమోరువంకలో గణేశ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వేంపల్లె వాసులు మృతిచెందారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో వేంపల్లె గ్రామానికి చెందిన వారు మొగమోరువంక వద్దకు గణేశ విగ్రహాన్ని తెచ్చారు. దీనిని నిమజ్జనం చేస్తుండగా వేంపల్లెకు చెందిన బేల్దారి జారిపాటి రాజా (36), క్రిస్టియన కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వంశీ (25) ప్రమాదవశాత్తు వంకలో పడిపోయారు. వారు పడిన చోట సుడిగండం ఉండటంతో గల్లంతయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వేంపల్లె వాసులు స్థానిక ఎస్‌ఐ మంజునాథ, తహసీల్దార్ లక్ష్మిదేవికి సమాచారం ఇచ్చారు. పులివెందుల అగ్నిమాపక సిబ్బంది స్థానిక గోనుమాకులపల్లెకు చెందిన మరో నలుగురు కలసి మొగమోరువంకలో దాదాపు 4గంటల పాటు గాలించి ఇద్దరి మృతదేహాలను బయటికి తీశారు. దీనితో అక్కడకు చేరుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బేల్దారి జారిపాటి రాజాకు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ యజమాని మృతిచెందడంతో పెద్ద దిక్కును కోల్పోయామని వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు వంశీ మృతిచెందడంతో అతడి తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. సంఘటన స్థలాన్ని ఆర్డీఓ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ చల్లని దొర పరిశీలించారు.