ఒంగోలు జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో సభ్యుల సంఖ్యను కుదించేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు అధికార పర్సన్ ఇన్‌చార్జి కమిటీలను ఆదేశిస్తూ జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యుల తొలగింపు ప్రక్రియను ఈనెల 10వ తేదీ నాటికి పూర్తిచేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. దీనిపై రైతులు భగ్గుముంటున్నారు. సొసైటీ సభ్యుల్లో భూమి లేనివారు, సేవలను వినియోగించుకోని వారిని సభ్యత్వం నుంచి తొలగించనున్నారు. కేవలం భూములు ఉన్న రైతులు, కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న వారిని మాత్రమే సభ్యులుగా కొనసాగించాలని జేసీ ఉత్తర్వుల్లో సూచించారు. జిల్లాలోని 93 సొసైటీల్లో 3.22 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరిలో మెజారిటీ సభ్యులకు భూమి లేదు. కౌలుకు తీసుకుని సాగు చేసేవారికి భూయజమానులు రాతపూర్వకంగా ఎటువంటి పత్రాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం వారు కూడా సొసైటీల్లో సభ్యత్వం కోల్పోవాల్సి వస్తోంది. సొసైటీల్లో లావాదేవీలు నిర్వహించని వారిని గుర్తించి ఇన్‌యాక్టివ్ సభ్యులుగా భావించి వారిని కూడా తొలగించనున్నారు.