భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడను వరదలు ముంచెత్తాయని.. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వాటి రిపేర్లు చేసే అంశంపై కంపెనీల ప్రతినిధులు బాధితులకు అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వరదలతో ప్రజల ఇళ్లల్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు తడిసి పాడైపోయాయని చెప్పారు. కంపెనీలు సామాజిక బాధ్యతతో బాధితుల ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేయడానికి ముందుకు రావాలని సూచించారు. స్పేర్ పార్ట్స్ డిస్కౌంట్‌లో అందించాలని విన్నవించారు. ఎలక్ట్రానిక్ కంపెనీల సేవల బృందాలు ఒకే వేదిక మీదకు వచ్చి సర్వీస్ అందిస్తే మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇప్పుడు ఆయా కంపెనీల ప్రతినిధులు స్పందించే తీరే కస్టమర్లలో ఆ కంపెనీ బ్రాండ్ నిలబడేలా చేస్తుందని అన్నారు. కంపెనీల వారిగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి అదనంగా టెక్నీషియన్లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు విన్నవించారు. వారం రోజులు టార్గెట్ పెట్టుకుని పని చేయాలని కంపెనీల యాజమాన్యాలను సీఎం చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తితో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక సర్వీస్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సేవలు అందజేస్తామని కంపెనీల ప్రతినిధులు బాధితులకు హామీ ఇచ్చారు.