కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో హోస్పేట్ సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్‌పై నిపుణుల కమిటీ కీలక హెచ్చరికలు చేసింది. 70 ఏళ్ల కిందట అమర్చిన గేట్లను పూర్తిగా మార్చాలని నివేదికలో పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం కేవలం 45 ఏళ్లు మాత్రమేనని.. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ గేట్లను అదనంగా మరో 25 ఏళ్లు వినియోగించారని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరమ్మతులు చేస్తే ప్రమాదం కోరి కొనితెచ్చుకున్నట్లే అని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో నిపుణుల బృందం నివేదిక సమర్పించింది.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నియమించిన నిపుణుల కమిటీ తుంగభద్ర డ్యామ్‌ను ఇటీవల సందర్శించింది. వరద ఉద్ధృతికి ఆగస్టు 10న 19వ నంబరు క్రస్ట్‌గేట్ కొట్టుకోపోయిన విషయం తెలిసిందే. దీని స్థానంలో ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శకత్వంలో తాత్కాలికంగా సాఫ్ట్‌లాక్ గేట్‌ను అమర్చారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ 32 క్రస్ట్‌గేట్ల భద్రత, పలు అంశాలపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని నియమించారు. ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ఈ బృందం.. తుంగభద్ర డ్యామ్ భద్రతకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
తుంగభద్ర గేటు ఎలా కొట్టుకుపోయింది..? మిగిలిన గేట్లు ఎంతవరకు భద్రం..? అన్న సందేహాలు తలెత్తడంతో నిపుణుల కమిటీ ద్వారా అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. దీంతో ఏకే బజాజ్ నేతృత్వంలో ఢిల్లీకి చెందిన రిటైర్డ్ మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణుడు హర్కేశ కుమార్, పలు సాగునీటి ప్రాజెక్టుల కోసం పని చేసిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణుడు తారాపురం సుధాకర్ సహా కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎంపిక చేసే ఇంజనీరింగ్ ప్రతినిధులతో ఆరుగురు సభ్యుల కమిటీని నియమించారు.
తుంభద్ర నది కర్ణాటకలోని రాయచూరు నుంచి మంత్రాలయం మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోకి వస్తుంది. రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉండే ఈ నది కర్నూలు సమీపంలో కృష్ణా నదిలో కలుస్తుంది. తుంగభద్ర నదిపై ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రయోజనం కోసం 1953లో డ్యామ్‌ను పూర్తిచేసి, ప్రారంభించారు. అప్పటి మద్రాసు రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్ దీని నిర్మాణంలో భాగస్వాములయ్యాయి. సర్ ఆర్థర్ ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి. చాలాకాలం బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నలిగి చివరకు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో నిర్మాణం ప్రారంభించారు. ఈ డ్యామ్ నీటిలో కర్ణాటకకు 138.99 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 73.01 టీఎంసీల చొప్పున వాటా ఉంది. కానీ, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో పూడిక పేరుకుపోవడంతో 100 టీఎంసీలకు పడిపోయింది.