ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఏపీకి చెందిన ఓ మహిళను ఆమె యజమాని గదిలో చిత్రహింసలకు గురి చేస్తున్న దారుణ ఘటన ఇది. యజమాని తనను బంధించి శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ బాధితురాలు ఓ వీడియో ద్వారా తన గోడును వెళ్లబోసింది. వీడియోలో అన్నమయ్య జిల్లాకు చెందిన కవిత అనే మహిళ తనను చిత్రహింసల నుండి రక్షించాలని కోరుతూ ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. "దయచేసి నన్ను రక్షించండి సార్.. ఇక్కడ చిత్రహింసలకు గురవుతున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. వికలాంగుడైన భర్త ఉన్నారు. వారి కోసమే కువైట్‌కు వచ్చాను. కానీ ఇక్కడ నాకు అన్యాయం జరుగుతోంది" అని చెప్పింది.కవిత యజమాని ఆమెను కువైట్‌లో ఒక గదిలో బంధించడంతో పాటు సరిగ్గా ఆహారం కూడా పెట్టకపోవడంతో ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఆమె తన యజమాని ఆఫీస్‌లో గృహనిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ఏజెంట్ ద్వారా కవిత అక్కడికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె పాస్‌పోర్టు లాక్కొవడంతో పాటు తన ఫోన్‌ను బ్లాక్ చేశారు. తద్వారా కుటుంబ సభ్యులు, అధికారులతో తనకు ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేశారని ఆమె పేర్కొంది.ఆమె విజ్ఞప్తికి స్పందించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెంటనే కేంద్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు లేఖ రాశారు. కవితను సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా జోక్యం చేసుకోవాలని కోరారు.