విజయవాడ వరద ప్రాంతాల్లో జీఎంసీ సిబ్బంది 12 రోజులు పాటు ఘననీయమైన సేవలు అందించారని గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ కొనియాడారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిరోజు లక్ష మందికి ఆహారాన్ని, త్రాగునీరు, పాలు పంపించామన్నారు. 62వ డివిజన్‌లో డ్రెయిన్లు బ్లాక్ కావడంతోనే ఇళ్ళలోకి నీరు చేరిందని తెలిపారు. గుంటూరు కార్పోరేషన్‌లో కూడా డ్రెయిన్లు శుభ్రం చేయించాలని నిర్ణయించామన్నారు.డ్రెయిన్లు ఆక్రమణలకు గురైన చోట ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఆక్రమణలు తొలగించాలని చెబుతున్నామన్నారు. ఆక్రమణదారులు ఆక్రమణలు తొలగించకపోతే కార్పోరేషన్ సిబ్బందే ఆక్రమణలు తొలగిస్తారని హెచ్చరించారు. పుట్‌పాత్‌లు ఆక్రమించి చాలా మంది పండ్ల వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. స్ట్రీట్స్ ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారందరికి వివిధ జోన్స్‌లలో వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని.. లే అవుట్స్ వేస్తున్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కమిటీలు వేస్తామని తెలిపారు. గ్రీన్ గ్రేస్ హైరేజ్ అపార్ట్మెంట్ నిర్మాణంలో అనుమతులు లేవన్న ఆరోపణలపై పరిశీలిస్తామని తెలిపారు. పరిశీలించిన అనంతరం నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ వెల్లడించారు.