ఆంధ్రప్రదేశ్‌లో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన చిత్తశుద్ధిని అన్ని రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు ప్రశంసిస్తున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించి సేవలు చేయాలో సీఎం చంద్రబాబు ఉదాహరణగా మిగిలారని ఢిల్లీలో చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు. అలాంటిది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎన్డీయే ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏలేరు రిజర్వాయర్ మునిగి రెండు వేల ఎకరాల్లో పంటనష్టం జరగడం వాస్తవమేనని ఎమ్మెల్యే సోమిరెడ్డి వెల్లడించారు. తాజాగా వచ్చిన వరదలకు ఏలేరులో 48వేల క్యూసెక్కుల నీరు ప్రవహించిందని తెలిపారు. ఆ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చంద్రబాబు సర్కార్, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం 10వేల క్యూసెక్కుల సామర్థ్యం గల ఏలేరు రిజర్వాయర్‌ను 70వేల క్యూసెక్కులకు పెంచి పనులు చేపట్టిందని, కానీ ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ పనులని అటకెక్కించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వైసీపీ హయాంలో 17వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి కాకినాడ వరకూ మునిగిపోయిందని సోమిరెడ్డి మండిపడ్డారు.