వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను చూశాం. వందే భారత్ స్లీపర్ రైళ్ల గురించి వింటున్నాం. ఇప్పుడు వందే మెట్రో ట్రైన్ అని భారతీయ రైల్వే మరో నూతన రైళ్లను తీసుకొస్తోంది. సెప్టెంబర్ 16వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోనే తొలి వందే మెట్రో రైలు ప్రారంభించనున్నారు. వందే మెట్రో లేదా వందే భారత్ మెట్రో అని పిలిచే ఈ రైలు ప్రత్యేకత ఏమిటనే దానిపై ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వందే భారత్ మెట్రో రైలుకు తేడా ఏమిటనే విషయాన్ని జనం తెగ వెతుకుతున్నారు. అయితే వందే భారత్ రైళ్లు పూర్తిగా రిజర్వ్‌డ్. అయితే ఈ వందే మెట్రో రైలు అన్ రిజర్వ్‌డ్ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని తక్కువ దూరం ఉన్న ప్రాంతాల మధ్య భారతీయ రైల్వే తీసుకువస్తోంది.
ఇక వందే మెట్రో గరిష్టంగా గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలోనే ఇది కూడా త్వరగా వేగాన్ని అందుకుంటుంది. ఫలితంగా ప్రయాణ సమయం తగ్గుతుంది. వందే మెట్రోలో 16 కోచ్‌లు ఉండనున్నాయి. 1150 మంది ప్రయాణికులు ఒకేసారి కూర్చుని ప్రయాణించేలా వందే మెట్రో సీట్ల సామర్థ్యం ఉంది. సుమారుగా 2 వేల మంది ప్రయాణికులు నిలబడి ప్రయాణించవచ్చు. ఇక మెట్రో రైళ్ల తరహాలోనే వందే మెట్రో రైలు తలుపులు కూడా ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. ప్రతి వందే మెట్రోలోనూ నాలుగు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇక ప్రయాణికులు తమ లగేజీని ఉంచుకోవడానికి అల్యూమినియంతో తయారు చేసిన ర్యాక్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్లు కూడా ఏర్పాటు చేశారు.
వందే మెట్రో పూర్తిగా ఎయిర్ కండీషన్డ్ రైలు. రైలుకు అటూ, ఇటూ ఉన్న డ్రైవర్ క్యాబిన్లలోనూ ఏసీని ఏర్పాటు చేశారు. ఏసీతో పాటుగా ఎల్ఈడీ లైట్లు, విశాలమైన కిటీకీలు ఏర్పాటు చేశారు. ఇక వందే మెట్రోలో సీసీటీవీ కెమెరాలు, ప్రజలకు సమాచారం అందించేందుకు వీలుగా పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్, ఎల్‌సీడీ డిస్‌ప్లేలు, మార్గాన్ని తెలియజేసేలా రూట్ మ్యాప్‌లు ఇండికేటర్లు ఉంటాయి. వందే మెట్రోలలో బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఇక ప్రయాణికుల భద్రత కోసం, ప్రమాదాల నివారణ కోసం కవచ్ వ్యవస్థను సైతం వందే మెట్రో రైలులో ఏర్పాటు చేశారు. గుజరాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించే వందే మెట్రో భుజ్- అహ్మదాబాద్ మధ్య నడవనుంది. ఈ వందే మెట్రో రైలును చెన్నైలోని ఐసీఎఫ్‌లో తయారు చేశారు.