ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే

international |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 12:23 AM

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్ నేత అనురా కుమార్ దిసనాయకే ప్రమాణస్వీకారం చేశారు. శ్రీలంక అధ్యక్ష భవనంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య.. ఆయనతో ప్రమాణం చేయించారు. 2022 ఆర్ధిక సంక్షోభం తర్వాత జరిగిన మొదటిసారి జరిగిన ఎన్నికల్లో అనురా కుమార్ విజయం సాధించి.. శ్రీలంకకు తొమ్మిదో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన ఆయన.. ఈ ఎన్నికల్లో మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ప్రచారంలో గత పాలకుల అవినీతి, వైఫల్యాలను ఎండగడుతూనే.. జవాబుదారీతనం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.


ఆర్థిక సంక్షోభంతో ప్రజల్లో కమ్ముకున్న నిరుత్సాహం, రాజపక్సే రాజీనామా వంటి పరిణామాలతో ఏర్పడిన నాయకత్వ శూన్యత వంటి పరిస్థితుల వేళ వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న యువతను.. అవినీతి వ్యతిరేక వైఖరితో అనురా ఆకట్టుకున్నారు. అవినీతిపై పోరాటమే ప్రచార అస్త్రంగా చేసుకొని 42.31 శాతం ఓట్లు సాధించి, సమీప ప్రత్యర్థి సాజిత్ ప్రేమదాస సమగి జన బలవేగయ (ఎస్‌జెబి)పై గెలుపొందారు.


శనివారం శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ జరగ్గా.. ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలుత మొదటి ప్రాధాన్య ఓట్లను లెక్కించినప్పటికీ... విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాలేదు. దీంతో గెలుపును నిర్ధరించేందుకు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా... ఇందులో కుమార దిసనాయకే విజయం సాధించారు. మొత్తం 1.7 కోట్ల మంది ఓటర్లలో 75 శాతానికి పైగా ప్రజలు ఓటు వేశారు.


ఇక, ఏకేడీగా ప్రసిద్ది పొందిన అనురా కుమార దిసనాయకే.. 1968 నవంబరు 23న అనురాధపురలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యంలో లేకున్నా.. రాజకీయ హింసలో తనకు సోదరుడి వరుసయ్యే వ్యక్తిని కోల్పోడం వంటి సంఘటన ఆ దిశగా అడుగులు వేసేలా చేసింది. 1987లో మార్క్సిస్టు ప్రభావిత జనతా విముక్తి పెరమున (జేవీపీ)తో ఆయన ప్రస్థానం మొదలైంది. ఆ మరుసటి ఏడాదే రాజకీయ హింసలో తన ఇళ్లు ధ్వంసం కాగా.. బంధువు హత్యకు గురయ్యారు.


ఇక, జేవీపీ ఏర్పడిన తొలినాళ్లలో సామ్రాజ్యవాద వ్యతిరేక, సామ్యవాద వైఖరిని కొనసాగించింది, కానీ 1980వ దశకం నాటికి అది జాతీయవాదం వైపు మళ్లింది. శ్రీలంక రాజకీయాల్లో తమిళులు, బయటవారి జోక్యాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. 1980లలో నిషేధం ఎదుర్కొని, తర్వాత రాజకీయ పార్టీగా మారి పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసింది. ఇక, 1998 నాటికి దిసనాయకేకు పొలిట్‌బ్యూరోలో చోటు దక్కింది. ఇక, 2000 ఎన్నికల్లో పోటిచేసీ మొదటిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2004- 2005 మధ్య అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ బండారునాయకే ఆధ్వర్యంలో కొంతకాలం వ్యవసాయ మంత్రిగా పనిచేశారు.


2014లో జేవీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి.. పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చారు. తర్వాత 12కుపైగా రాజకీయ గ్రూప్‌లు, మేధావులు, విద్యా వేత్తలు, సామాజిక ఉద్యమకారులతో కలిసి జాతీయ పీపుల్స్ పవర్ కూటమిని ఏర్పాటుచేశారు. లంక రాజకీయాల్లో పాతుకుపోయిన శ్రీలంక రాజకీయ పార్టీ, యునైటెడ్ నేషనల్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా దీనిని నిలపడమే లక్ష్యంగా పనిచేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com