రైల్వేలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని గుంతకల్లు డీఆర్‌ఎం విజయకుమార్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు డు డీ జగదీశ కోరారు. ఈ మేరకు గుంతకల్లు పట్టణంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో సోమవారం ఉదయం ఆయన పలువురు సీపీఐ నాయకులతో డీఆర్‌ఎంను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (నెం. 17216) గుంటూరు నుంచి విజయవాడకు చేరడానికి దాదాపుగా 2 గంటల సమయం తీసుకుంటోందన్నారు. అలాగే కొండాపూర్-ఎర్రగుంట్ల స్టేషన్ల మధ్య కేవలం 41 కి.మీ.ల దూరం ఉన్నా ఈ రైలు చేరడానికి గంటా పది నిమిషాల సమయం తీసుకుంటోందన్నారు. ధర్మవరం-నర్సాపురం (వయా తిరుపతి) ఎక్స్‌ప్రెస్ (17248)ను అనంతపురం నుంచి బయలుదేరేలా మార్చాలన్నారు. అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫారాలలో వృద్ధుల కోసం బ్యాటరీ కార్లను ఏర్పాటుచేయాలని తెలిపారు.
అనంతపురం స్టేషనలో కేవలం ఒక లిఫ్టు మాత్రమే ఉందని, అన్ని ప్లాట్‌ఫారాల్లోనూ లిఫ్టులను, ఎస్కలేటర్లను ఏర్పాటుచేయాలని విన్నవించారు. వినతిపత్రా న్ని ఇచ్చినవారిలో సీపీఐ జిల్లా నాయకుడు బీ గోవిందు, పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సహాయ కార్యదర్శి ఎస్ మహమ్మద్ గౌస్, మండల కార్యదర్శి రాయల్ రా ము, సహాయ కార్యదర్శి రామాంజనేయులు, నాయకుడు ప్రసాద్ పాల్గొన్నారు.