మ్యాట్రిమోని డాట్.కామ్‌లో పెళ్ళి కాని వారిని ట్రాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఏలూరు జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్ళికొడుకు అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 లక్షల నగదు, బ్యాంకు పుస్తకాలు, కంప్యూటర్ సామగ్రీని భీమడోలు పోలిసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా బంగారు పేటకు చెందిన పాశం అనిల్ ప్రధాన నిందితుడని తెలిపారు. ఇస్రోలో ఉద్యోగం అని ఆస్తులు, బంగ్లాలు ఉన్నాయని మోసం చేసి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చెప్పారు. ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేశామని.. అనిల్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ముఠాలోని మరికొంతమంది సభ్యులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. సమాజంలో రకరకాల మోసగాళ్లు పెరుగుతున్నారని.. ప్రజల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పెళ్లిళ్లు విషయంలో ఎటువంటి విచారణ జరపకుండా చేయవద్దని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ స్పష్టం చేశారు.