విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ మహా చండీదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. అయితే అమ్మవారి దర్శనానికి వెళ్తున్న తనను పదేపదే అడ్డుకుంటున్నారని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్నవారిని ఆపలేదన్న మేయర్ భాగ్యలక్ష్మి.. కూటమి ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్నవారిని ఆపుతూనే ఉన్నారని విమర్శించారు. విజయవాడ నగర ప్రధమ పౌరురాలైన తనను పదే పదే అడ్డగించడం ఎంత వరకూ సబబంటూ ప్రశ్నించారు. వీఐపీ దర్శనాల సమయంలోనే దర్శనానికి వచ్చినప్పటికీ ఆపుతున్నారని విజయవాడ మేయర్ ఆరోపించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగర పాలక సంస్థ నుంచి శానిటేషన్ కోసం ఆలయ అధికారులు అడిగిన సహాయ సహకారాలను పూర్తిగా అందిస్తున్నామని మేయర్ చెప్పారు. కానీ ప్రతిచోటా తనను ఆపి అవమానపరుస్తామని అన్నారు. బీసీ మహిళకు ఇలా చేయడం ఆవేదన కల్గిస్తోందన్నారు. ఇంద్రకీలాద్రిపై విజయవాడ మేయర్ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య భక్తుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్ధమవుతుందోంటూ ఆరోపణలు చేశారు. దీని ఫలితం ఇంతకింత అనుభవించక తప్పదంటూ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విమర్శించారు.
" ఒక బీసీ మహిళను, మేయర్‌ను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. నగర ప్రథమ మహిళకు ఇదేనా ఇచ్చే గౌరవం.. ప్రతిచోటా మేయర్‌నని చెప్పుకుంటూనే పోవాలా. డ్యూటీ అంటూ పోలీసులు ఆపేస్తున్నారు. వీఐపీ దర్శనం సమయంలోనే వస్తున్నాం. టైమ్ ప్రకారం వచ్చినప్పటికీ అడుగడుగునా ఆపుతున్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిందే. ప్రోటోకాల్ పాటించకుండా మా ఇష్టం మా ప్రభుత్వం అంటే ఊరుకునేది లేదు. దీని ఫలితాన్ని అనుభవిస్తారంటూ".. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎమోషనల్ అయ్యారు.
మరోవైపు రాయన భాగ్యలక్ష్మిని గత ఎన్నికల సమయంలో విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దింపాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావించారు. అయితే చివరకు మైనారిటీ లీడర్ షేక్ ఆసిఫ్‌ను పోటీ చేయించారు. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయం సాధించారు. 47 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.