తమిళనాడులో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. తిరువల్లూరు జిల్లాలో గూడ్సు రైలును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలు భోగీలు పట్టాలు తప్పగా..నాలుగు ఏసీ కోచ్‌ల్లో మంటలు చెలరేగాయి. రైలు నెంబరు 12578 మైసూరు-దర్బంగా భాగమతి ఎక్స్‌ప్రెస్.. చెన్నై సమీపంలోని కావరాయ్‌పెట్టాయ్ స్టేషన్ వద్ద ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన రాత్రి 8.50 గంటలకు చోటుచేసుకుందని తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు అక్కడకు చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? అనేది మాత్రం తెలియరాలేదు. ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో నెల్లూరు-చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలును రద్దుచేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. వీటిలో నాలుగు ఏసీ కోచ్‌లు, రెండు అన్-రిజర్వుడ్ కోచ్‌లు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమాచారం కోసం దక్షిణ రైల్వే చెన్నైలో హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది.
చెన్నై డివిజన్
044 25354151
044 24354995
సమస్తీపూర్ డివిజన్
06274-81029188
దర్భంగా
06272-8210335395
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్
7525039558
సిగ్నలింగ్ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు సిగ్నల్ లోపం వల్ల మెయిన్ రూట్ నుంచి లూప్ లైన్‌లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్సును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కుదుపునకు గురై పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలికి డీఆర్ఎం, ఉన్నతాధికారులు బయలుదేరారు. ముందుజాగ్రత్త చర్యగా అంబులెన్స్‌లను అధికారులు సిద్ధం చేశారు. మంటలు అంటుకున్న బోగీల్లో ఉన్నవారిని సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. కాగా, ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస రైలు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతేడాది ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 300 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయపడ్డారు. బాలేశ్వర్ వద్ద మెయిన్ లైన్ నుంచి లూప్‌లైన్‌లోకి వచ్చిన కోరమాండల్ సూపర్‌ఫాస్ట్.. అక్కడ ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టగా.. ఆ సమయంలో ఆ మార్గంలో వస్తోన్న హౌర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది.