కర్నూలు జిల్లా, ఉలిందకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాముడు (19) అనే యువకుడు దుర్మరణం చెందాడు. కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన సువర్ణమ్మ, గిడ్డయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు సంతానం. గిడ్డయ్య పదేళ్ల క్రితం మృతి చెందడంతో సువర్ణమ్మ తన భర్త ఊరు వెంకటగిరి గ్రామం వదిలేసి పుట్టినిల్లయిన కల్లూరు మండలం కే మార్కాపురంలో నివాసం ఉంటోంది. పెద్ద కూతురుకు ఇదివరకే పెళ్లి చేసింది. చిన్న కూతురుకు పుల్లగుమ్మికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది.
బుధవారం ఉదయం 10 గంటలకు తలంబ్రాలు ఉండడంతో కుటుం బ సభ్యులంతా బంధువులతో కలిసి బొలేరో వాహనంలో మంగళవారం రాత్రి కే మార్కాపురం నుంచి బయలుదే రారు. రాముడు బంధువులనంతా సాగనంపి ఇళ్లంతా సర్దిన అనంతరం ఇంటికి తాళం వేసి తన మిత్రుడు కేసుల స్వామితో కలిసి మోటారు సైకిల్‌పై బయలుదే రాడు. చిన్నటేకూరు సమీపంలో మట్టి కుప్పలు అడ్డంగా ఉండటాన్ని చీకటిలో గుర్తించలేని రాముడు మోటారు సైకిల్‌ను వాటిపైకి ఎక్కించాడు. దీంతో అదుపు తప్పి పక్కన ఉన్న కల్వర్టులో పడిపోయారు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత బంధువులకు సమాచారం ఇవ్వడంతో పెళ్లికి బయలు దేరిన బృందమంతా తిరిగి ఆసుపత్రికి చేరుకుంది. చికిత్స పొందుతూ రాముడు తెల్లవారు జామున మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.