ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో దీపం పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగానే.. అక్కడ ఉన్న ఆయన ఫ్యాన్స్.. ఓజీ,,ఓజీ అంటూ అరుపులు, కేకలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా స్పందించిన పవన్ కళ్యాణ్.. సినిమా పేర్లు కేకలు వేయడం కంటే భగవన్నామస్మరణ చేస్తే బాగుంటుందని సూచించారు. సినిమాలు ఒక సరదా మాత్రమే.. కానీ సినిమాలు కూడా ఉండాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే ఓజీ, సినిమా గురించి ఇప్పుడు మాత్రమే కాకుండా కొన్ని రోజుల క్రితం తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో కూడా ఫ్యాన్స్ సందడి చేశారు. ఓజీ,,ఓజీ అంటూ అభిమానులు అరవగా.. ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడే సమయం కాదని.. తన ఫ్యాన్స్‌కు పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి కేకలు ఆపేయాలని వారికి సూచించారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
సుజీత్ డైరెక్షన్‌లో వస్తున్న ఓజీ సినిమాపై టాలీవుడ్‌లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సుజీత్.. పవన్ కళ్యాణ్‌ను చాలా స్టైలిష్ లుక్‌లో చూపించడంతో పాటు.. పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకునే విధంగా కథ, కథనాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓ పక్క రాజకీయాల్లో, పాలనలో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. మరోవైపు ఓజీ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ టీం భావిస్తోంది.
ఐఎస్ జగన్నాధపురంలో దీపం పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సరిగా అమలు జరగలేదని విమర్శించారు. కుటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి చూపుతోందని తెలిపారు. దీపం పథకం కింద ఏడాదికి రూ.2,684 కోట్లు.. ఐదేళ్లకు రూ.13,425 కోట్లు తమ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. 14 ఏళ్ల క్రితం తాను ఐఎస్ జగన్నాధపురం ఆలయానికి వచ్చానని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఇక్కడ స్వయంభుగా వెలసిన లక్ష్మీ నరసింహ స్వామిని ఎప్పుడు కోరుకుంటానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.