ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తోన్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఫథకాన్ని ప్రారంభించేందుకు ఏలూరు వెళ్లే క్రమంలో ఆయన రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్‌ని కలిసేందుకు ఓ కుటుంబం ప్రయత్నించింది. స్కూల్ యాజమాన్యం వేధింపులతో పదో తరగతి చదువుతోన్న తన కూతురు ఆత్మహత్య చేసుకుందని.. పవన్ సార్ మీరే న్యాయం చేయాలంటూ బాలిక తల్లి, ఇతర కుటుంబసభ్యులు ఆయన కారుకు అడ్డం పడ్డారు.
దీంతో కలగజేసుకున్న మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వారిని వారించారు. పవన్ కళ్యాణ్ తిరిగి వెళ్లేటప్పుడు ఎయిర్‌పోర్టులో మిమ్మల్ని కలిసి మాట్లాడతారు.. కచ్చితంగా న్యాయం చేస్తారు అని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తమతో మాట్లాడి న్యాయం చేసేవరకు తాము ఇక్కడి నుంచి వెళ్లబోమని వారు తేల్చిచెప్పారు. స్కూల్ వేధింపులతో చనిపోయిన తన కూతురికి న్యాయం చేయాలంటూ రెండు వారాలుగా తిరుగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అయితేనే తమకు న్యాయం చేస్తారన్న భరోసా కుటుంబమంతా కలిసి వచ్చినట్లు తెలిపారు. తన కూతురి ప్రాణాలు బలిగొన్న స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంకలోని ఓ స్కూల్‌లో వెన్నెల అనే బాలిక పదో తరగతి చదువుతోంది. మొన్న దసరా పండక్కి అన్ని స్కూల్స్ సెలవులు ఇవ్వగా.. వెన్నెల చదివే స్కూల్ మాత్రం బలవంతంగా క్లాసులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వెన్నెల తన తండ్రికి చెప్పగా ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్కూల్ డైరెక్టర్ ఉమారాణి.. వెన్నెలను వేధింపులకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. దీంతో భయపడిపోయిన బాలిక బలవన్మరణానికి పాల్పడింది. స్కూల్ డైరెక్టర్ ఉమారాణి బెదిరింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ వెన్నెల తండ్రి శ్రీనివాస్ ఆలమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు నిరసనలు చేపట్టాయి. వెన్నెల కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాడతామని హెచ్చరించాయి.
వెన్నెల ఆత్మహత్య సంఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి కమల కుమారి స్పందిస్తూ.. బాలిక ఆత్మహత్యపై విచారణ జరిపి ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక అందజేసినట్లు తెలిపారు. దసరా సెలవులు తర్వాత అక్టోబర్ 14, 15 తేదీల్లో వెన్నెల స్కూల్‌కు హాజరైందని.. 16, 17, 18 తేదీల్లో క్లాసులకు హాజరు కాలేదని తెలిపారు. వెన్నెల 18వ తేదీన ఆత్మహత్య చేసుకోగా 22వ తేదీన తమ దృష్టికి వచ్చినట్లు విద్యాశాఖ అధికారి కమల కుమారి పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు న్యాయం చేయాలని కోరుతున్నారు.