నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు జరపలేదని నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా సెల్వమణి తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపకుండా ఆరు కోట్ల ఆంధ్రులను అవమానించిందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించారని.. ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మన పొరుగున ఉన్న రాష్ట్రాలు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాయని.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరగడం లేదంటూ రోజా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న.. తెలంగాణకు అవతరణ దినం ఉందని.. అలాగే కర్ణాటకకు అవతరణ దినోత్సవం ఉందని.. తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు కూడా అవతరణ దినోత్సవాలు ఉన్నాయని.. కానీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం వలన.. ఆంధ్రప్రదేశ్‌కు అవతరణ దినోత్సవం లేకుండా పోయిందని రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపని చంద్రబాబు ప్రభుత్వం.. జిల్లా స్థాయిలో కూడా అవతరణ దినోత్సవాల నిర్వహణ రద్దు చేసిందని రోజా మండిపడ్డారు. గతంలో వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపకపోవడం ఏంటని రోజా ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని అవహేళన చేసేలా నిర్ణయించడం దారుణమని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించరా.. ఎంత దారుణం అంటూ ఆమె ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా.. మీరు అసలు పాలకులేనా అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భావితరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు అవతరించిందని అడిగితే.. ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు అంటూ రోజా నిలదీశారు.
గత ప్రభుత్వంలానే ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని రోజా డిమాండ్ చేశారు. 6 కోట్ల మంది తెలుగు ప్రజలను అవమానించినందుకు.. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవమానించినందుకు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు రోజా ట్వీట్ చేశారు.