అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. ఈ సీజన్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు యాత్రికులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. ఇలాంటి వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి మూడు రకాల ప్రత్యేక బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ అందబాటులోకి తెచ్చింది. టెక్కలి నుంచి శబరిమలకు ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని్ టెక్కలి ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. టెక్కలి నుంచి శబరిమలకు 5, 7, 11 రోజుల టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ఇక ఐదు రోజుల ప్యాకేజీలో భాగంగా టెక్కలిలో బయల్దేరనున్న ఆర్టీసీ బస్సు.. విజయవాడ, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. అయ్యప్ప దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, అన్నవరం, సింహాచలం మీదుగా తిరిగి టెక్కలి చేరుకుంటుంది. ఈ ప్యాకేజీ ఎంచుకున్న వారు.. అయ్యప్ప దర్శినంతో పాటుగా పైన చెప్పిన ఆలయాలను కూడా సందర్శించవచ్చు. ఇక ఏడు రోజుల ప్యాకేజీలో టెక్కలిలో బయల్దేరనున్న ఆర్టీసీ సర్వీస్.. విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానానికి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో మధురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం, సింహాచలం మీదుగా తిరిగి టెక్కలి చేరుకుంటుంది.
మూడో ప్యాకేజీ అయిన 11 రోజుల టూర్‌లో.. ఆర్టీసీ బస్సు శ్రీశైలం, మహానంది, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, గురువాయూర్, ఎరుమేలి, పంబ మీదుగా శబరిమలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, శ్రీరంగం, కంచి, తిరుపతి, శ్రీ కాళహస్తి, విజయవాడ, అన్నవరం, సింహాచలం ఆలయాలను సందర్శించవచ్చు. అయితే ఎంచుకున్న బస్సు సర్వీస్, టూర్ ప్యాకేజీ ప్రకారం రేట్లు ఉంటాయని డిపో అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు టెక్కలి డిపో మేనేజర్‌లను సంప్రదించవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు. శబరిమలకు వెళ్లాలనుకునేవారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని సూచించారు. మరోవైపు ప్రతి ఏటా టెక్కలి డిపో నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని డిపో యాజమాన్యం తెలిపింది.