తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలోని భూముల విలువ భారీగా పెరిగిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కంటే ముందు భూముల విలువ మరి అంతగా లేదని అభిప్రాయపడ్డారు. ఆయనకు కేసీఆర్ అంటే వ్యక్తిగతంగా ఎంతో అభిమానం అంట ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ పాలనపైనా తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.
తాను తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు రఘురామ. తాను ఐదు రోజులు నియోజకవర్గంలో ఉంటున్నానని.. ఒకటి, రెండు రోజులు మాత్రం హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు పదేళ్ల పాటూ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పాలన బాలేదని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. తనకు వ్యక్తిగతంగా కేసీఆర్ అంటే ఇష్టమని.. ఆయన్ను కలిసి సందర్భాలు తక్కువేనన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ కనీసం 10సార్లు పెరిగిందన్నారు.
గతంలో కరీంనగర్‌లో ఎకరా రూ.10 లక్షల నుంచి 15 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు అయ్యిందన్నారు. హైదరాబాద్ నగరంతో పాటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల విలువ చాలా పెరిగిందన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో కూడా ఆ విలువ పెరుగుతూనే ఉందని.. ఆయనతో పాటూ తాను కూడా లోక్‌సభలో ఎంపీగా ఉన్నానన్నారు. రేవంత్ కెపాసిటీ ఉన్న నేత.. తెలంగాణలో రేవంత్ వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి కొనసాగుతోందన్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ సుందరీకరణ కోసం ప్లాన్ చేస్తున్నారని.. మూడో సిటీ కూడా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. రేవంత్ పాలన కూడా బావుందని కితాబిచ్చారు. రఘురామ చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది. రఘురామకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పరిచయం ఉంది. 2019 ఎన్నికల్లో ఇద్దరు ఎంపీలుగా పోటీ చేశారు.. రఘురామ నర్సాపురం నుంచి, రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి నుంచి విజయం సాధించారు. లోక్‌సభలో ఇద్దరు నేతలు పలు సందర్భాల్లో కలిశారు. ఇదే విషయాన్ని రఘురామ ప్రస్తావించారు.