ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు మంత్రి నారాయణ తీపికబురు చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. తెలుగు జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రకటన చేశారు. ప్రజల సంక్షేమం, అవినీతి అక్రమాలను వెలికితీసే జర్నలిస్టుల సంక్షేమం బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాట్లాడే హక్కును హరించినా.. మీడియా ఎంతో ధైర్యంగా ప్రజల సమస్యల పరిష్కారం పనిచేసిందన్నారు.
గత ప్రభుత్వ అరాచకాలను మీడియా వెలికితీయకుంటే.. కూటమి ప్రభుత్వానికి ఈ స్థాయిలో మెజారిటీ వచ్చేదికాదని వ్యాఖ్యానించారు మంత్రి నారాయణ. రాష్ట్రంలో ప్రజలకు పూర్తి పారదర్శక పాలన అందించడంలో మీడియా సహకారం ఎంతో అవసరం ఉందన్నారు. జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని..వారి సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. ఏ ప్రభుత్వానికైనా చెవులు, కళ్లు మీడియానే అన్నారు.
అమరావతి పనుల్ని వచ్చే జనవరి నుంచి ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం అమరావతి పనులను పట్టించుకోలేదని.. అప్పట్లో ఇచ్చిన టెండర్లకు కాలపరిమితి పూర్తయిందన్నారు. అందుకే వాటిని రద్దు చేసి.. తాజాగా మళ్లీ కేబినెట్ ఆమోదంతో టెండర్లు పిలుస్తామన్నారు. ఈ ప్రక్రియ నవంబరు 15 నుంచి డిసెంబరు 15 లోపు పూర్తి చేసి.. జనవరి నుంచి తిరిగి పనులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలుకు ప్రభుత్వం వద్ద ప్రజల స్థితిగతులపై పూర్తి సమాచారం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల ఆర్థిక పరిస్థితి బాగుంటేనే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుందన్నారు. ప్రతి ఒక్కరి ఆదాయం రెట్టింపు కావాలనే లక్ష్యమని..అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు సక్రమంగా పేదలకు చేరాలంటే.. డేటా ప్రొఫైలింగ్ ఎంతో అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి కచ్చితమైన సమాచారం ఉంటేనే.. పేదరిక నిర్మూలనకు అది సాయపడుతుంది అన్నారు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ.