ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి కార్తీక మాసం వేడుకలు ప్రారంభం కాగా.. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా ఆకాశ దీపం వెలిగించారు. అర్చకులు, శ్రీశైలం ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆకాశదీపానికి పూజలు చేసి.. స్వామివారి ఆలయ స్వర్ణ ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు. మరోవైపు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీశైలానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శ్రీశైలానికి పోటెత్తుతున్న భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. మల్లన్న దర్శనానికి బారులు తీరుతున్నారు. మరోవైపు ఆలయ ఉత్తర మాడవీధిలో, ఆలయ ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద కార్తీక దీపారాధనలు నిర్వహించారు.
భక్తుల రద్దీతో వసతి సముదాయాలు, సత్రాలు కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలంలో ఉచిత దర్శనానికి 5గంటల సమయం పడుతుండగా..ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కార్తీక మాసం నెలమొత్తం గర్భాలయం అభిషేకాలు రద్దు చేశారు. అలాగే సామూహిక అభిషేకాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, కుంకుమార్చన సేవ రద్దు చేశారు. మరోవైపు కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో చేసిన ఏర్పాట్లను ఈవో చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఆలయ మాడవీధులు,పుష్కరిణి, అన్నప్రసాద వితరణ, పాతాళగంగ, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి కీలక సూచనలు చేశారు. ఉత్తర మాడవీధి, గంగాధర మండపం ఎదురుగా కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
శ్రీశైలం ఆలయం పుష్కరిణిలో హారతి కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించిన ఈవో.. ఎలాంటి లోపాలు లేకుండా శాస్త్రోక్తంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే లక్షదీపోత్సవానికి వీలుగా కోనేటి పరిసరాలలో దీపాలను క్రమపద్ధతిలో ఏర్పాటు చేయాలని ఈవో చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. పుష్పాలంకరణ చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఈవో ఆదేశించారు. పాతాళగంగ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఈవో.. పరిసరాలను, మెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా పాతాళగంగ నీటిమట్టం వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు దృఢంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా కార్తీక మాస శివ చతుసప్తాహ భజనలు శ్రీశైలంలో ప్రారంభమయ్యాయి. ఈవో చంద్రశేఖర్ రెడ్డి శనివారం వీటిని ప్రారంభించారు. లోక కళ్యాణం కోసం ఏటా శ్రావణ, కార్తీక మాసంలో శివ చతుసప్తాహ భజనలను నిర్వహిస్తారు.