భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప-రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ ఖన్నా వచ్చే ఏడాది మే 13 వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఇక, 2019 జనవరి 18వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ ఖన్నా 1960 మే 14వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న జస్టిస్ సంజీవ్.. సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్న వ్యక్తి.
తీస్‌హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టు, ట్రైబ్యునళ్లలో లాయర్‌గా ప్రాక్టీస్ చేసి.. మొదటిసారి. 2005లో ఢిల్లీ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2006లో ఢిల్లీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏ హైకోర్టుకూ చీఫ్ జస్టిస్‌గా పని చేయకుండానే నేరుగా ఈ ఘనత సాధించిన అతి కొద్దిమంది న్యాయమూర్తిల్లో జస్టిస్ ఖన్నా ఒకరు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నాకు ఆయన స్వయానా సోదరుడి కుమారుడు. ముఖ్యమైన రాజ్యాంగసంబంధ కేసుల్లో పెదనాన్న జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా ఇచ్చిన తీర్పులతో స్ఫూర్తిపొంది న్యాయవాద వృత్తివైపే మొగ్గుచూపారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో జరిగిన ఏడీఎం జబల్‌పూర్ కేసు (1976)లో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయొచ్చని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజార్టీతో తీర్పు ఇవ్వగా.. వ్యతిరేకించిన ఏకైక ధర్మాసన సభ్యుడిగా జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా చరిత్రలో నిలిచారు. ఆ కారణంగా నాటి ప్రధాని ఇందిర సీనియారిటీ పరంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉన్న ఆయన్ను పక్కనపెట్టి జస్టిస్ ఎం.హమీదుల్లాబేగ్‌ను సీజేఐగా చేశారన్న వాదన కూడా ఉంది. ఈ పరిణామంతో కలతచెిందిన జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా తన పదవీకాలం ముగియడానికి 3 నెలల న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గానూ.. అంతేకాకుండా భోపాల్‌లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ పాలక మండలి సభ్యుడిగానూ కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు చరిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ముఖ్యంగా ఈవీఎంలపై అనుమానాలకు సంబంధించిన కేసుల్లో తీర్పు చెప్పారు. ఈవీఎంలు సురక్షితమైనవని, బూత్‌ల ఆక్రమణ, బోగస్ ఓటింగ్‌లకు చెక్ పెడతాయని స్పష్టం చేయడమే కాకుండా ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించారు. అలాగే, ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దును సమర్దిస్తూ ఇచ్చిన ధర్మాసనంలోనూ జస్టిస్ ఖన్నా భాగస్వామి.