కర్నూలు స్థానిక నంద్యాల చెక్ పోస్ట్‌లోని రోడ్ల ప్యాచ్ వర్క్‌లను, ఎన్‌హెచ్ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతులు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నంద్యాల చెక్ పోస్ట్ నుంచి గార్గేయపురం వరకూ రోడ్డు పనులు పరిశీలించినట్లు తెలిపారు. కేజీ రహదారి విస్తరణ.. నగరంలోని రోడ్లు వెడల్పుకు డీపీఆర్ తయారు చేయమని అధికారులను ఆదేశించానన్నారు. రోడ్లపై ట్రాన్స్ ఫార్మర్స్ ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని.. వాటిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.ఆదోనిలో గుంతల పూడ్చివేత 40 శాతం మాత్రమే జరిగిందని.. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సంక్రాంతి లోపల రాష్ట్ర వ్యాప్తంగా గుంతలను పూడ్చి వేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రోడ్ల పనులకు రెన్యూవల్ చేయలేదని.. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. అలాగే టూరిజంకు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. అమరావతిలో భారీ బడ్జెట్‌తో రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో రోడ్లపై అధ్యయనం చేశామని.. త్వరలోనే పీపీ మాడల్‌లో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.గతంలో పక్క రాష్ట్రం తెలంగాణ.. ఏపీపై జోకులు వేసుకునే వారన్నారు. గత ప్రభుత్వంలో 42 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేశామని సాక్షి దినపత్రిక రాసిందని.. ఎక్కడ నిర్మించారో చూపించాలని ప్రశ్నించారు. ఓర్వకల్లు అభివృద్ధికి మూడు వేల కోట్లు కేంద్రం నిధులు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ హబ్ అడిగామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చారని.. అందుకు సీఎంకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంత్రితో పాటు పాణ్యం శ్యాసనసభ్యులు గౌరు చరిత రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. ఆర్ అండ్ బి ఎస్‌ఈ మహేశ్వర రెడ్డి మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తదితరులు ఉన్నారు.