ఫోటోలు తీయడమే అతని పాపమా.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడమే అతని నేరమా.. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఘటన గురించి వింటే ఇలాగే అనిపిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో దారుణం జరిగింది. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో చిక్కం వీర దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని ఆక్వా రైతులు స్తంభానికి కట్టేసి కొట్టారు. రైతుల దాడిలో గాయపడిన దుర్గాప్రసాద్ అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేరారు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఉప్పలగుప్తం పోలీసులు కేసు నమోదు చేశారు, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.
పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. సన్నవిల్లికి చెందిన దుర్గాప్రసాద్ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తుంటారు. ఇందులో భాగంగా తమ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై దుర్గా ప్రసాద్ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ చెరువుల తవ్వకాల కారణంగా నీటి కాలుష్యం జరుగుతోందని.. పర్యావరణం దెబ్బతింటోందని దుర్గాప్రసాద్ చెప్తున్నారు. ఇదే విషయమై కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ఆక్వా చెరువుల తవ్వకాలను నిలిపి వేయాలంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో కొంత మంది రైతులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఆక్వా చెరువులు తవ్వే ప్రయత్నం చేశారు.
ఈ విషయంపై దుర్గాప్రసాద్ అధికారులను ఆశ్రయించారు. కోర్డు ఉత్తర్వులను పట్టించుకోకుండా చెరువుల తవ్వకాలు చేపడుతున్నారంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే సాక్ష్యాధారాలు ఉండాలన్న అధికారుల సూచనతో దుర్గాప్రసాద్ అక్రమంగా తవ్వుతున్న ఆక్వా చెరువుల వద్దకు వెళ్లారు. అక్కడ ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానిక ఆక్వా రైతులు.. దుర్గాప్రసాద్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే దుర్గాప్రసాద్‌ను స్తంభానికి కట్టేసి అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన దుర్గాప్రసాద్.. అమలాపురం ఆస్పత్రిలో చేరారు. అలాగే ఉప్పలగుప్తం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆక్వా రైతుల అరాచకంపై నెటిజనం మండిపడుతున్నారు.