బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న కూతురు.. కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో కుటుంబం.. చివరకు దేవుడే దిక్కంటే ఓ చర్చిని ఆశ్రయించారు. నారు పోసిన వాడే నీరు పోయక పోతాడా అనే ఆశ. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న తమకు ఆ దేవుడే సాయం చేస్తాడనే నమ్మకం.. అదే నమ్మకంతో 40 రోజులు చర్చిలో ప్రార్థించారు. కానీ వారి నమ్మకం వమ్ము అయ్యింది. దేవుడు చిన్న చూపు చూశాడు. కన్నబిడ్డ కానరాని లోకాలకు వెళ్లిపోయింది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం అదురుపల్లిలో జరిగిన విషాద కథ ఇది.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం బాలాజీరావుపేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు సంతానం. ఎనిమిదేళ్ల భవ్యశ్రీ రెండు నెలల కింద అనారోగ్యానికి గురైంది. నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్తే స్కానింగ్ తీసి బ్రెయిన్ ట్యూమర్ అన్నారు. చెన్నైలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని.. లేకుంటే కష్టమని చెప్పారు. దీంతో అసలే అంతంత మాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న లక్ష్మయ్యకు గుండెల్లో రాయి పడ్డట్లైంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఓ వైపు కన్న ప్రేమ.. మరోవైపు ఖరీదైన వైద్యం చేయించలేని పరిస్థితి. దీంతో ఆ తల్లిదండ్రులు అల్లాడిపోయారు. తమ కూతుర్ని కాపాడుకునే మార్గమే లేదా అని కుమిలిపోయారు. చివరకు అప్పో సొప్పో చేసి వైద్యం చేయించాలని నిర్ణయించుకున్న ఆ దంపతులు.. భవ్యశ్రీని హైదరబాద్ లేదా చెన్నైకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అయితే చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తే చిన్నారికి బాగవుతుందని ఇరుగు పొరుగు వారు చెప్పారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి ఈ మాటలు ఆశలు రేపాయి. చేజర్ల మండలం అదురుపల్లి చర్చికి భవ్యశ్రీని తీసుకెళ్లారు దంపతులు. అక్కడి పాస్టర్ కూడా ప్రార్థనలు చేద్దామని.. తగ్గకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు చర్చిలో ప్రార్థనలు చేస్తూ వచ్చారు. ఓ వారం రోజులు గడిచాయి. బిడ్డ కాస్త హుషారుగా కనిపించడంతో ఆ తల్లిదండ్రుల్లో చిన్నారికి బాగవుతుందనే ఆశలు మొదలయ్యాయి. అలా వారం కాస్తా రెండు వారాలు.. చివరకూ నెల దాటిపోయింది. 40 రోజుల తర్వాత చిన్నారి భవ్యశ్రీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. సోమవారం రాత్రి చర్చిలోనే భవ్యశ్రీ కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
అయితే ఉపవాసం పేరుతో మూడు రోజుల నుంచి భవ్యశ్రీకి చర్చిలో ఆహారం పెట్టలేదని.. దీంతో బాలిక చనిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లనీయకుండా తల్లిదండ్రులను పాస్టర్ మభ్యపెట్టారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. చర్చి వద్ద ఆందోళనకు కూడా దిగారు. అయితే భవ్యశ్రీకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని.. బతకడం కష్టమని డాక్టర్లు చెప్పడంతోనే చర్చిలో ఉంచినట్లు భవ్యశ్రీ తల్లి లక్ష్మి చెప్తున్నారు. డబ్బులు లేకపోవటంతోనే ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయినట్లు వాపోయారు. చిన్నారి మృతదేహాన్ని బాలాజీరావుపేటకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు.