ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దీపం 2 పథకానికి అద్భుతమైన స్పందన వస్తోంది. దీపం 2 పథకం కింద ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. ఇప్పటికే మొదటి గ్యాస్ సిలిండర్ పంపిణీ జరుగుతోంది. దీపావళి పండుగ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీపం 2 పథకానికి సంబంధించిన వివరాలను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందన్న మంత్రి.. ఇప్పటి వరకూ ఎన్ని ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసామనే వివరాలను వెల్లడించారు. నవంబర్ ఒకటో తేదీన ఈ పథకం ప్రారంభం కాగా.. ఈ 42 రోజుల్లో 80.37 లక్షల మంది ఉచిత సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
బుకింగ్ చేసుకున్న వారిలో 62.30 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే 58.30 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.463.81 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని వివరించారు. అంటే 97.4 శాతం మందికి అకౌంట్లలో డబ్బులు జమచేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కోటీ 55 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారుల జీవన ప్రమాణాలను మెరుగు పరచాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం తెచ్చినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకానికి తొలి విడతగా రూ. 2,684 కోట్లు కేటాయించామని.. అందులో రూ.894 కోట్లు పెట్రోలియం కంపెనీలకు మంజూరు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులు తొలుత గ్యాస్ సిలిండర్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజుల్లోగా ఆ మొత్తం అమౌంట్‌ను ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే 24 గంటల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల్లో సిలిండర్ డెలివరీ చేస్తున్నారు.
దీపం 2 పథకం కింద అర్హులైన వారికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. నాలుగు నెలలకు ఓ ఉచిత సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి జులై మధ్య ఒక సిలిండర్, ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్యన రెండో సిలిండర్, డిసెంబర్ నుంచి మార్చి మధ్యన మూడో సిలిండర్ కోసం బుకింగ్ చేసుకోవచ్చు. 2025 మార్చి 31 వరకూ మొదటి ఉచిత సిలిండర్ తీసుకునే అవకాశం ఉంది. ఇక లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారాల కోసం ఏపీ ప్రభుత్వం 1967 టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసింది.