ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాను రానివ్వం.. నరేంద్ర మోదీకి శ్రీలంక అధ్యక్షుడి హామీ

national |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 06:54 PM

భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక భారత్‌కు వ్యతిరేకంగా పొరుగున ఉన్న దేశాలతో చైనా సన్నిహితంగా మెలుగుతూ.. వాటిని భారత్‌పైకి ఉసిగొల్పుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ వంటి దేశాలను భారత్‌కు బద్ధశత్రువులుగా చేసేందుకు.. ఆ దేశాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. అయితే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఈ దేశాలు ఇప్పుడు చైనా చెప్పినట్లు వింటున్నాయి. ఇదే సమయంలో రాజపక్స కుటుంబం వీడిన తర్వాత.. తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన శ్రీలంకను కూడా తమ అవసరాలకు వాడుకునేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టు లక్ష్యంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేందుకు డ్రాగన్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.


ఈ నేపథ్యంలోనే శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి భారత్ వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే.. 3 రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయి.. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య చైనా విషయం ప్రస్తావనకు రావడంతో దానిపై అనుర కుమార దిసనాయకే స్పందించారు. భారత్‌కు వ్యతిరేకంగా శ్రీలంక గడ్డపై ఎలాంటి చర్యలకు తాము అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పారు. శ్రీలంకపై తన ప్రభావాన్ని పెంచుకునేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. శ్రీలంక అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారతదేశ ప్రయోజనాలకు భంగం కలిగించేలా తమ భూభాగాన్ని ఇతర దేశాలు ఉపయోగించుకోవడాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చి చెప్పారు.


ఈ క్రమంలోనే భారత్‌తో తాము త్వరలోనే రక్షణ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు అనుర కుమార దిసనాయకే ప్రకటించారు. ఇక సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన శ్రీలంక అధ్యక్షుడు.. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ద్వైపాక్షిక భద్రతా సహకార ఒప్పందాన్ని త్వరలోనే ముగించాలని నిర్ణయించారు.


ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న శ్రీలంకను బయటపడి స్థిరత్వం సాధించే వరకు ఆ దేశానికి భారత్ మద్దతు కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇచ్చిన అప్పులను తిరిగి భారత్‌కు చెల్లించడంలో శ్రీలంకకు కొంత వెసులుబాటు కల్పించేలా ఒప్పందం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భారత్, శ్రీలంక మధ్య విద్యుత్‌ గ్రిడ్‌ అనుసంధానత, పెట్రోలియం పైప్‌లైన్‌ల ఏర్పాటుతో ఇంధన సంబంధాలను బలోపేతం చేసుకోనున్నట్లు ఇరు దేశాధినేతలు పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలోనే భారత్, శ్రీలంక మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు రెండు దేశాల మధ్య అనుసంధానం మరింత పెరగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఇందులో భాగంగానే తమిళనాడులోని రామేశ్వరం నుంచి.. శ్రీలంకలోని తలైమన్నార్‌ మధ్య ఫెర్రీ సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే తమిళనాడులోని నాగపట్నం నుంచి శ్రీలంకకు ఫెర్రీ సేవలను సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక శ్రీలంక అధ్యక్షుడితో జరిగిన చర్చల్లో భారత మత్స్యకారుల అంశాన్ని మోదీ చర్చించారు. భారత జాలర్ల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఇద్దరు నేతలు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa