రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో స్టూడెంట్స్ ప్రారంభించిన ఉద్యమం.. చివరికి ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి పారిపోయేలా చేసింది. అయితే అప్పటివరకు భారత్‌తో మిత్ర దేశంగా ఉన్న బంగ్లాదేశ్.. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. భారత్‌కు శత్రుదేశంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువులు, ముస్లింలు కలిసి మెలిసి ఉండగా.. షేక్ హసీనా గద్దె దిగిపోయిన తర్వాత మత కల్లోలాలు ఏర్పడ్డాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లోని హిందువుల ఇళ్లు, ఆస్తులు, దేవాలయాలపై దాడులు ఒక్కసారిగా పెరిగాయి. హిందువులు మాత్రమే కాకుండా ఇతర మైనారిటీలపై కూడా గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో తీవ్ర దాడులు, హింస చోటు చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే 2024లో మనకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో హిందువులపై జరిగిన దాడులకు సంబంధించి వివరాలను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించింది. 2024లో ఇప్పటివరకు హిందువులపై బంగ్లాదేశ్‌లో 2200 హింసాత్మక దాడులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో కూలిపోయిన తర్వాత ఈ దాడులు ఎక్కువ అయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయలో పాకిస్తాన్‌లో హిందువులపై 112 దాడులు నమోదైనట్లు తెలిపింది.
హిందువులపై జరుగుతున్న హింసాత్మక దాడులకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు ఇప్పటికే లేఖలు రాసినట్లు వెల్లడించింది. ఆయా దేశాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆపి.. వారి భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరింది. హిందువులపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని.. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఇప్పటికే చెప్పినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. హిందువులు, ఇతర మైనారిటీల భద్రత, సంక్షేమం కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని భారత్ ఆశిస్తోందని రాజ్యసభకు వివరించింది.
దౌత్యపరమైన మార్గాల ద్వారా ఆయా దేశాల్లో మైనారిటీలపై జరుగుతున్న హింసను లేవనెత్తుతూనే ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. మత అసహనం, మతపరమైన హింస, మైనారిటీ వర్గాలపై దాడులను అడ్డుకునేందుకు.. మైనారిటీల భద్రత, శ్రేయస్సు కోసం చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పింది. పాకిస్తాన్‌లోని మైనారిటీలు ఎదుర్కొంటున్న తీవ్ర పరిస్థితులను అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎప్పటికప్పుడూ లేవనెత్తుతూనే ఉందని తెలిపింది.
ఇక బంగ్లాదేశ్‌లో 2022లో హిందువులపై 47 హింసాత్మక దాడులు నమోదు కాగా.. 2023లో 302, 2024లో 2200 దాడులు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్‌లో 2022లో 241.. 2023లో 103.. 2024లో 112 హింసాత్మక ఘటనలు నమోదైనట్లు చెప్పింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్.. మైనారిటీ, మానవ హక్కుల సంస్థల డేటాను ప్రకారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.