మన దేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎప్పటినుంచో ఇదే నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. అయితే ఇటీవల మాత్రం వరుసగా పతనం అవుతోంది. గతంలో మార్కెట్ విలువ రూ. 21 లక్షల కోట్ల మార్కు దాటి సరికొత్త చరిత్ర సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇటీవల పడిపోతుంది. కొన్ని నెలల వ్యవధిలో దారుణంగా తగ్గడం గమనార్హం. ఈ క్రమంలోనే అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన కంపెనీ తన హోదాను కోల్పోతుందని అనుకుంటున్న తరుణంలో.. రెండో స్థానంలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ విలువ పడుతూనే ఉంది. దీంతో రిలయన్స్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
శుక్రవారం సెషన్‌లో (డిసెంబర్ 20) NSE లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 52 వారాల కనిష్ట విలువను చేరింది. అంతకుముందు సెషన్లో రూ. 1230.45 వద్ద ముగిసిన షేరు.. కిందటి రోజు ఇంట్రాడేలో రూ. 1201.50 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ క్రమంలోనే మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 16.32 లక్షల కోట్లకు పడిపోయింది. గరిష్టాల నుంచి దాదాపు రూ. 4 లక్షల కోట్లకుపైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇక టీసీఎస్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 15.08 లక్షల కోట్లుగా ఉంది.
ఇక కొద్ది రోజుల కిందట స్టాక్ ధర రూ. 3 వేలకు సమీపంలో ఉండగా.. ఇటీవల బోనస్ షేర్లను ప్రకటించిన క్రమంలో దానికి తగ్గట్లుగానే షేరు ధర భారీగా తగ్గినట్లు కనిపిస్తుంది. కనిష్ట స్థాయిల్లో అందుబాటులో ఉన్నప్పటికీ కొనుగోళ్లు జరగకుండా.. ఇంకా అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో ఇంకా ఇంకా స్టాక్ ధర పడుతూనే ఉంది.
రిలయన్స్ షేరు కొద్ది రోజులుగా పెద్ద మొత్తంలో పతనమైంది. ముఖ్యంగా రెండో త్రైమాసిక ఫలితాల్లో అంతగా రాణించకపోవడం కారణం. మరీ ముఖ్యంగా ఇంధన వ్యాపారాల్లో క్షీణత నమోదు కావడం ప్రభావం చూపింది. గత 5 రోజుల వ్యవధిలో 5 శాతానికిపైగా పడిపోగా.. నెల రోజుల్లోనూ నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 నెలల వ్యవధిలో ఈ షేరు ధర 17 శాతానికిపైగా కుప్పకూలింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కూడా దాదాపు 7 శాతం పడిపోయింది. ఏడాది వ్యవధిలో ఈ స్టాక్ దాదాపు 6 శాతం దిగొచ్చింది.
అంటే ఈ ఏడాది మరో 10 రోజుల్లో ముగియనుండగా.. ఈ ఏడాదిలో ఈ స్టాక్ నష్టాలతోనే ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో గత పదేళ్లలో తొలిసారి .. రిలయన్స్ షేరు ఏడాదిని నెగెటివ్‌లో ముగిస్తుండటం గమనార్హం. 2015లో ఈ స్టాక్ 13 శాతానికిపైగా పెరిగింది. తర్వాత వరుస సంవత్సరాల్లో 6.67 శాతం, 70.55 శాతం, 21.71 శాతం, 35.06 శాతం, 32.33 శాతం, 19.32 శాతం, 7.6 శాతం, 1.44 శాతం పెరిగింది. ఈ ఏడాదిలోనే నష్టపోయింది.