రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆవేదన చెందారు.
ఇప్పటివరకు 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా చెబుతున్నా, అనధికారికంగా ఆ సంఖ్య 150కి పైగానే ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన గుర్తు చేశారు. అయన మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతుల సమస్యలు పరిష్కరించకపోగా, ఎప్పటికప్పడు డైవర్షన్ పాలిటిక్స్‌తోనే సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం. ఒక పక్క భారీ వర్షాలు, వరదలు. మరోవైపు కరవు పరిస్థితి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది అని అన్నారు.