విజన్ అంటే అప్పులు చేయడమేనా అని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అప్పుల్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా కేవలం ఆరు నెలల కాలంలోనే ఏకంగా రూ.1,12,750 కోట్ల అప్పులతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక సరికొత్త రికార్డ్ సృష్టించిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి చురకలంటించారు.
ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 3 నెలలున్నప్పటికీ ఇన్ని కోట్ల అప్పులు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఆయన గుర్తు చేశారు. గత వైయస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వినాశనం చూశామంటున్న కూటమి పాలకులు, ఇప్పుడు తాము చేస్తున్న నిజమైన విధ్వంసాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు.