రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే పట్టించుకోని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, దురుద్దేశంతోనే రాయలసీమలో యువతను రెచ్చగొట్టేందుకు గాలివీడు వచ్చారని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ఆక్షేపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో చివరకు న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆయన వెల్లడించారు. అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాటలో భాగంగా, రాయచోటిలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా కూడా పని చేసిన సీనియర్ లాయర్ సుదర్శన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
నిరసన కార్యక్రమం తర్వాత స్వగ్రామానికి వెళ్తూ, మధ్యలో గాలివీడు ఎంపీపీ కార్యాలయం చేరుకున్నారు. అందుకు కారణం ఆయన తల్లి ఎంపీపీ. ఆమె గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో సమావేశానికి హాజరవుతున్నారు. ఆమెను కలవడానికి సుదర్శన్‌రెడ్డి ఆ కార్యాలయానికి వెళ్లారు. దీన్ని ముందే పసిగట్టిన టీడీపీ శ్రేణులు సమావేశాన్ని రసాభాస చేయడానికి సిద్ధమయ్యారు. సమావేశంలో ఎలాగైనా రచ్చ చేయాలని నిర్ణయించిన టీడీపీ శ్రేణులు దాదాపు 100 మందిని సమీకరించి కారం పొడి, పెప్పర్ పౌడర్‌తో దాడి చేసే ప్రయత్నం చేశారు. ముందస్తుగానే ఎంపీడీవో, ఇతర అధికారులను ప్రలోభాలకు గురిచేసి సుదర్శన్‌రెడ్డి దాడి చేశాడని కట్టుకథ అల్లారు. టీడీపీ శ్రేణులు వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద చేస్తున్న దాడులను మరుగున పడేసేందుకు చేసిన పన్నాగం ఇది అని అన్నారు.