కూచిపూడి నృత్యం అజరామరంగా విరాజిల్లే విధంగా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కృష్ణాజిల్లా , మువ్వ మండలం కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కూచిపూడి నృత్య గురువులు, కళాకారులు పాల్గొన్నారు. కూచిపూడి కళాక్షేత్రాన్ని మంత్రి దుర్గేష్, రఘురామకృష్ణంరాజు సందర్శించారు.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. 50 అడుగుల ఏకశిలపై కూచిపూడి నృత్య భంగిమలతో పతాకాన్ని ప్రపంచానికి సమర్పించడం అద్భుతమని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన ఏపీలో ఆదరణ లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మనది అని చెప్పుకొని సాంస్కృతిక, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.