సోషల్ మీడియా విషయంలో ప్రజలను, నెటిజన్లను చైతన్యపరిచేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్ఫింగ్, బూతు పురాణంతో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టవద్దంటూ తాజాగా క్యాంపెయిన్ చేపట్టింది. సోషల్ మీడియాను మంచికి వాడుదామంటూ పలు నగరాల్లో భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. విజయవాడ- గుంటూరు దారిలో తాడేపల్లి హైవే వద్ద అధికారులు భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.
రాజధాని అమరావతితోపాటు తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఫ్లెక్లీలు, హోర్డింగ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో సోషల్ మీడియాపై క్యాంపెయిన్ ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ చేర్చి చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగులపై ప్రదర్శించింది. "పోస్ట్ నో ఈవిల్" పేరుతో ఫోర్త్ మంకీ బొమ్మతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
"మేక్ సోషల్ మీడియా ఎ పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్" పేరుతో ప్రధాన కూడళ్లలో వద్ద హోర్డింగులు కనువిందు చేస్తున్నాయి.సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయెుద్దని, విద్వేషపూరిత, విషపు రాతలు రాయెుద్దంటూ అధికారులు ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాను మంచికి, పాజిటివ్ అంశాలకు వేదికగా మార్చుదామనే స్లోగన్‌లను వాటిపై ముద్రించారు. అందరికీ అర్థమయ్యేలా ఆంగ్లం, తెలుగు భాషల్లో వీటిని ఏర్పాటు చేయించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో విష ప్రచారం, వ్యక్తిత్వ హననాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ పోలీసులు ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు.