పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద స్థలం సిద్ధంగా ఉండి గృహాన్ని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపించే పేదలందరికీ వెంటనే మంజూరు చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణను చేపట్టింది. లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా యూనిట్ విలువను కూడా పెంచుతోంది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్కో పక్కాగృహ నిర్మాణానికి రూ.1.50లక్షలను మంజూరు చేసింది.
నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో నిర్మాణాలు మా వల్ల కాదు బాబోయ్ అంటూ పేదలు గగ్గోలుపెట్టడంతో ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.30వేల అప్పును ఇప్పించింది. అది కూడా అందరికీ మంజూరు కాలేదు. దీంతో ప్రభుత్వం ఇచ్చే రూ.1.50లక్షలతో ఇంటి బేసుమట్టం మాత్రమే వేసుకుని నిర్మాణాలను నిలిపేసిన లబ్ధిదారులు అనేక మంది ఉన్నారు. దీంతో యూనిట్ విలువను పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.