జగన్ ప్రభుత్వంలో బిల్లులు రాక అప్పుల పాలై 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓ కాంట్రాక్టర్‌నని.. తనకు జగన్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా తనపై కక్షగట్టిందని చెప్పారు. గత ఐదేళ్లలో జగన్ దుర్మార్గపు పాలన చేశారని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తాను పలు పనులు చేశానని గుర్తుచేశారు. చంద్రబాబు హయంలో వర్క్స్ చేశారు కాబట్టి ఆయన్నే బిల్లులు అడగాలని వైసీపీ పెద్దలు తనను హీనంగా మాట్లాడారని వాపోయారు.
పార్టీ మారితే బిల్లులు మంజూరు చేస్తామని వైసీపీ పెద్దలు తనపై వత్తిడి చేశారన్నారు. అయినా తాను పార్టీ మారలేదని చెప్పారు. జగన్ ప్రభుత్వం మంజూరు చేయకున్నా వర్క్స్ పూర్తి చేశానని తెలిపారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి మాటలు నమ్మి కొంతమంది కాంట్రాక్టర్లు వైసీపీలో చేరారని.. వారికి నేటికీ వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.