ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా యుద్ధం తాలూకు విషాద ఘటనలు ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. గాజాలో హింస ఆగడంలేదు. కాల్పుల విరమణ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న సమయంలో గాజాపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఈ దాడుల్లో ఓ శరణార్థి శిబిరంలో పలువురు చిన్నారులు కూడా మరణించారు. సెంట్రల్ గాజాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులను అల్ అక్సా హాస్పిటల్ ధృవీకరించింది. ఈ దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ (ఇక్కడ, ఇక్కడ) అవుతోంది. బెంజమిన్ నెతన్యాహును పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్నట్లుగా ఆ ఫోటోలో ఉంది. ఇందులో నిజమెంత?
క్లెయిమ్ ఏంటి?
సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో @MR_COOL77777 అనే యూజర్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్ట్ ఫోటోను షేర్ చేస్తూ ఇలా రాశారు - ‘పని పూర్తయింది!’.
‘యుద్ధ నేరగాడు (War Criminal) ఇక జైలుకు వెళ్తున్నాడు’ అంటూ @SaraReyi అకౌంట్ నుంచి ఇదే ఫోటోను ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో మరి కొంత మంది యూజర్లు కూడా ఈ ఫోటోను షేర్ చేస్తూ.. బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేసినట్లుగా క్యాప్షన్ ఇచ్చారు.
వైరల్ ఫోటోలో నిజం ఏమిటి?
బెంజమిన్ నెతన్యాహు అరెస్టయ్యారంటూ షేర్ చేస్తున్న వార్త సంచలనం మారింది. చాలా మంది యూజర్లు ఈ ఘటన జరిగినట్లు నమ్ముతూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వైరల్ ఫోటో వెనుక నిజానిజాలేంటో కనుగొనేందుకు సజగ్ బృందం ప్రయత్నించింది.
గూగుల్ లెన్స్ సాయంతో రివర్స్ ఇమేజ్ పద్ధతి ద్వారా వైరల్ ఫోటోను పరిశీలించినప్పుడు, కొన్ని నెలల కిందటి, ఒక సంవత్సరం కిందటి పాత పోస్ట్‌లను గుర్తించాం. ఆ పోస్టులలోనూ ఇదే చిత్రాన్ని షేర్ చేశారు. దీంతో ఈ విషయం ఇటీవలిది కాదని తేలిపోయింది.
ఇక బెంజమిన్ నెతన్యాహు అరెస్ట్ అనే కీవర్డ్‌ని ఉపయోగించి సెర్చ్ చేయగా.. Google లో ఎలాంటి వార్తా నివేదికలు లభించలేదు. ఈ ఫోటో నకిలీది అయుంటుందని అనుమానం వచ్చింది.
సజగ్ బృందం ఈ ఫోటోను AI సాధనం decopy.ai లో అప్‌లోడ్ చేసి పరిశీలించగా నకిలీదని తేలింది. ఈ ఫోటో 94.95% ఏఐ సాయంతో రూపొందించిందని ఫలితం వచ్చింది.
ఆ తర్వాత ఇదే ఫోటోను ట్రూ మీడియాలోనూ తనిఖీ చేయగా.. ఇది 87 శాతం నకిలీదని తేలింది.
ఇది అసలు సంగతీ...?
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో నకిలీది. AIతో రూపొందించిన ఫోటోను తప్పుడు క్లెయిమ్‌తో షేర్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa