ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కటింగ్ చేసే రోబోలు వచ్చాయా..? ఎలన్ మస్క్ ‘రోబో’తో హెయిర్‌కట్ చేయించుకున్న వీడియో నిజమేనా?

national |  Suryaa Desk  | Published : Sat, Jan 04, 2025, 08:29 PM

టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ‘రోబో’ సాయంతో హెయిర్‌కట్ చేయించుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (ఇక్కడ, ఇక్కడ) అవుతోంది. ఆ వీడియోలో ఓ రోబో.. ఎలన్ మస్క్‌కు కటింగ్ చేస్తున్నట్లుగా ఉంది. ‘ఈ రోబో ఆవిష్కరణతో.. ఇక రానున్న రోజుల్లో చాలా మంది వృత్తులు, వ్యాపారాలు దెబ్బతిననున్నాయి. ఈ వీడియో ద్వారా ప్రపంచానికి ఎలన్ మస్క్ ఇదే సందేశాన్ని అందిస్తున్నారు’ అని పేర్కొంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ వీడియో నిజమేనా? నిజంగానే మనుషులకు కటింగ్ చేసే రోబోలు వచ్చాయా..? ఇప్పుడు తెలుసుకుందాం..


క్లెయిమ్ ఏంటి?


ఎలన్ మస్క్ తన టెస్లా సంస్థ నుంచి సరికొత్త హ్యుమనాయిడ్ రోబోను తీసుకొచ్చారు. ఈ రోబో మనుషులకు హెయిర్‌కట్ చేస్తుంది. ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.


ఫేస్‌బుక్‌లో Ethiraje Muthu అనే అకౌంట్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. టెస్లా అధిపతి ఎలన్ మస్క్.. రోబో సాయంతో హెయిర్‌కట్ చేయించుకుంటున్నారని, భవిష్యత్తులో ఈ రంగంలో చాలా మంది నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారని పేర్కొన్నారు.


ఎక్స్ (ట్విట్టర్)లో Ashish Kushwaha అనే యూజర్ కూడా ఇదే వీడియోను షేర్ చేస్తూ.. ఎలన్ మస్క్‌కు ఒక రోబో హెయిర్ కటింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. మరి కొంత మంది యూజర్లు కూడా ఇదే రకమైన క్లెయిమ్‌తో ఈ వీడియోను షేర్ చేశారు.


వాస్తవం ఏంటి?


సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ వీడియో వెనుక నిజానిజాలను తెలుసుకునేందుకు మేం (Sajag Team) తొలుత ఈ అంశానికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్‌ను ఉపయోగించి ఇంటర్నెట్‌లో వార్తల కోసం సెర్చ్ చేశాం. రోబో సాయంతో ఎలన్ మస్క్ హెయిర్‌కట్ చేసుకున్నట్లుగా ఎలాంటి వార్తా కథనాలు లభించలేదు.


ఆ తర్వాత మేము ఎలన్ మస్క్ ‘ఎక్స్’ ప్రొఫైల్‌ని కూడా తనిఖీ చేశాం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఎలన్ మస్క్ తన అకౌంట్ నుంచి ఇలాంటి వీడియోను షేర్ చేయలేదని గుర్తించాం. ఇక వైరల్ అవుతున్న వీడియో క్లిప్పింగ్‌ను జాగ్రత్తగా గమనిస్తే.. అందులో కొన్ని అసాధారణ విజువల్స్ ఉన్నట్లు గుర్తించాం. ముఖ్యంగా ఎలన్ మస్క్ చేతి వేళ్ల సంఖ్య తేడాగా ఉండటం, రోబో ఆయనకు హెయిర్ కట్ చేస్తున్నప్పటికీ జుట్టు కత్తిరించబడకపోవడం గమనించవచ్చు. దీంతో ఈ వీడియో CGI/VFXని ఉపయోగించి రూపొందించి ఉండవచ్చనే అనుమానం కలిగింది.


వైరల్ వీడియో నుంచి కొన్ని కీఫ్రేమ్‌లను తీసుకొని decopy.ai ద్వారా పరిశీలించగా.. ఇది ఫేక్ వీడియో అని తెలిసింది. 92.84% AI ద్వారా సృష్టించి ఉండవచ్చని ఫలితం వచ్చింది.


Elon Musk video AI Result


ఇక చివరగా.. వీడియోలోని కొన్ని స్క్రీన్‌షాట్స్ తీసుకొని గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2024 డిసెంబర్ 17న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఒరిజినల్ వీడియో లభించింది. ‘aismartzone’ అనే పేజీలో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. అంతేకాకుండా, ఈ వీడియో నిజమైనది కాదని, AI సాధనాల సాయంతో రూపొందించిన CGI వీడియో అని ఈ పోస్ట్‌లో క్లియర్‌గా పేర్కొన్నారు.


‘బార్బర్ చేసే పనులను ఒక రోబో చేస్తుందని ఊహించారా?! సెలూన్‌లో ఒక రోబో పర్‌ఫెక్ట్‌గా హెయిర్‌కట్ చేస్తున్న ఘట్టాన్ని ఊహించండి. ఇది ఏఐ సాయంతో రూపొందించిన వీడియో. కానీ ఎవరికి తెలుసు? సమీప భవిష్యత్తులో ఇది నిజం కావచ్చేమో!’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.


ఇదే ఇన్‌స్టా పేజీలో మేము ఏఐ సాయంతో రూపొందించిన అనేక ఇతర వీడియోలను కూడా గుర్తించాం. ఈ అకౌంట్ నుంచి తీసుకొన్న వీడియోను సోషల్ మీడియాలో తప్పుడు క్లెయిమ్‌తో షేర్ చేస్తున్నారని గుర్తించాం.


ఇది అసలు నిజం.....?


టెస్లా అధినేత ఎలన్ మస్క్ ‘రోబో’ సాయంతో హెయిర్‌కట్ చేయించుకున్నారంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో నిజంకాదు. AI‌తో రూపొందించిన ఈ వీడియోను తప్పుడు క్లెయిమ్‌తో నిజమైన విజువల్స్‌గా షేర్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com