జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందిన వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ కార్తీక్ సంతాపం ప్రకటిస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నానని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి కావడం బాధాకరమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. దేశ రక్షణ కోసం అమరుడైన జవాన్ చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని, ఆయన కుటుంబానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్తీక్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.