మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కి దుర్భర జీవితం అనుభవిస్తున్న 4,357 మంది చిన్నారులను ఆపరేషన్ స్మైల్ ప్రాజెక్టులో భాగంగా రక్షించినట్లు మహిళా భద్రతా విభాగం డిజీపీ షికాగోయల్ శుక్రవారం తెలిపారు. మానవ అక్రమ రవాణా, పిల్లల అపహరణ వంటి కేసులను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ప్రతి ఏటా జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. ఈ క్రమంలో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మొత్తం 4,357 మంది చిన్నారులను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు తెలిపారు. వారిలో 3,897 మంది బాలురు ఉండగా, 460 మంది బాలికలు ఉన్నారని వెల్లడించారు.