రూపాయి విలువ ఊహించని స్థాయిలో పడిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెక్సికో, కెనడా, చైనా వంటి దేశాలపై టారిఫ్ లు విధించడం రూపాయి క్షీణతకు కారణమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ టారిఫ్ లు పెంచడం వల్ల అంతర్జాతీయ వాణిజ్య ముప్పు వచ్చే ప్రమాదం ఉందని మోర్గాన్ స్టాన్లీ ఆందోళన వ్యక్తం చేసింది కూడా. ఆర్బి ఎల్ బ్యాంక్ ట్రెజరీ హెడ్ , ఇదే పరిస్థితి ఇంకో 6-8 వారాలు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలో అసలు రూపాయి పతనానికి గల కారణాలు ఏమిటి ? ఇది సామాన్యులపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉండొచ్చు? దీని వల్ల లాభపడే రంగాలు ఉన్నాయా? అన్నది వివరంగా చూద్దాం.
డాలర్ విలువ బలపడుతూ ఉండటం రూపాయి విలువ పడిపోవటానికి ఒక కారణం. ఒక పక్క అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అమెరికన్ డాలర్ విలువ పెంచడంలో వ్యూహాత్మక చర్యలు తీసుకుంటూ ఉంది. ఇంకో పక్క భారతదేశంలో విదేశి మారక ద్రవ్య నిలువు 2022 లో 58 లక్షల కోట్లు ఉంటే, 2023 కి ఆ మొత్తం 48 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ విదేశి మారక ద్రవ్య నిలువలు తగ్గిపోతూ ఉండటం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఊహించిన స్థాయిలో రూపాయిని నియింత్రించలేకపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్న విదేశి మారక ద్రవ్య నిలువలను వినియోగించినా అది తాత్కాలిక పరిష్కారం అవుతుంది తప్ప శాశ్వత పరిష్కారం అయితే కాదు.
రెండో విషయానికి వస్తే చమురు దిగుమతుల్లో భారత దేశం మూడవ స్థానంలో ఉంది. 2022 -23 లో మన చమురు దిగుమతుల ఖర్చు 12 లక్షల కోట్లు ఉంటె, ఇప్పుడు రూపాయి విలువలో వచ్చిన మార్పు వల్ల 56 వేల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై పడుతుంది. ఫలితంగా వాణిజ్య లోటు, ద్రవ్యోలణం పెరిగి దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊహించని భారంగా మారతాయి.
ఇప్పుడు ఓ రకమైన అనిశ్చితకరమైన ఆర్ధిక వాతావరణం ఉన్న నేపథ్యంలో ఎక్కువమంది డాలర్ ను సేఫ్ ఆప్షన్ గా అనుకోవడం వల్ల కూడా డాలర్ విలువ బలపడుతూ, రూపాయి,అలాగే ఇతర కరెన్సీలు కొంత బలహీనపడుతున్నాయి.
అయితే ఈ రూపాయి పతనమవుతున్న వాతావరణం ఓ వైపు ఉంటె దీని వల్ల లాభపడే రంగాలు కూడా ఉన్నాయి. ఏ సంస్థలైతే విదేశాల్లో ఉన్న వారికి సాఫ్ట్ వేర్ ఉత్పత్తులు, అవుట్ సోర్సింగ్ సేవలు అందిస్తాయో వాటికి మాత్రం ఇది లాభకరమైన పరిణామమే. దీని వల్ల వారి చెల్లింపులు కూడా డాలర్లో ఉండటం వల్ల ఎక్కువ లాభపడే అవకాశం ఉంది.
విదేశాలకు వస్త్రాలు ఎగుమతి చేసే సంస్థలకు కూడా డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గడం లాభదాయకమే. మెడిసిన్ రంగంలో మందులు విదేశాలకు ఎగుమతి చేసే సంస్థలకు కూడా భారి చెల్లింపులే ముడతాయి. విదేశాలకు ఆటోమొబైల్ విడి భాగాలను ఎగుమతి చేసే సంస్థలు, పెట్రో ,కెమికల్ పరిశ్రమలు ,రత్నాలు ఆభరణాల పరిశ్రమలు కూడా దీని వల్ల లాభపడే అవకాశాలు ఉన్నాయి.
ఇక రూపాయి విలువ పతనం కావడం వల్ల వచ్చే నష్టాలను గమనిస్తే దీని వల్ల వచ్చే ద్రవ్యోల్భణ౦ వల్ల ధరలు పెరిగే అవకాశం ఎక్కువ. ధరలు పెరిగితే కొనుక్కునే వారు తగ్గిపోతారు. దాని ద్వారా సగటు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఈ సందర్భంలో విదేశాల నుండి ఏ కంపెని అయినా ఋణం తీసుకుంటే దాని మీద కూడా భారం పడుతుంది.దీని వల్ల పెట్టుబడులు కూడా తగ్గిపోతాయి.
అయితే దీని గురించి ఆర్ధిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ, “రూపాయి విలువ క్షీణించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దాని గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుందని, రూపాయి విలువ ఎవరు నియంత్రించేది కాదని, దానికంటూ ఒక స్థిరమైన ధర ఉండదని”అన్నారు.
రూపాయి పతనం అన్నది సామాన్యులను అంత త్వరగా ఏమాత్రం ప్రభావితం చేయదని, విదేశి పెట్టుబడులు, ఫారెన్ ఎక్స్ చేంజ్ రిటర్న్స్ విషయాల్లో మాత్రమే కొంత దుష్పరిణామాలు చూపే అవకాశం ఉందని ఈ క్రమంలో వినిపిస్తున్న ఇంకో వాదన.వాదనలు ఏమైనప్పటికీ రూపాయి పతనం దెస ఆర్ధిక వ్యవస్థకు ఏ మాత్రం మంచి పరిణామం కాదన్నది కాదనలేని వాస్తవం. ఈ ప్రభావం ఒకేసారి ప్రత్యక్షంగా ఉండకపోయినా తప్పక పరోక్షంగా ఉంటుంది అన్నది కూడా అంతే సత్యం. ఇక ముందు ముందు ట్రంప్ దూకుడు ఇదే స్థాయిలో కొనసాగుతుందా లేక కొంతైనా వ్యతిరేకత వల్ల తగ్గే అవకాశం ఉంటుందా? లేకపోతే ఈ పరిణామం మరి శ్రుతి మించితే డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ వస్తుందా అన్న విషయాల్లో స్పష్టత వస్తే తప్ప ఈ రూపాయి విలువ ఎలా దేశాన్ని మార్చబోతుంది అన్న అంశం మీద స్పష్టత రావడం కష్టం!