మణిపూర్‌లో జాతుల మధ్య హింసకు ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ప్రేరేపించారంటూ లీకైన ఆడియో క్లిప్‌పై హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూత్ ల్యాబ్స్ ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక సంచలనం రేపుతోంది. ‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధాలను లూటీ చేసేందుకు మైతేయీలకు అవకాశమివ్వండి’’ అంటూ ఆదేశించే ఆడియో క్లిప్ వైరల్ అయిన విషయం తెలిసిందే..! ఈ క్లిప్‌లోని ఆడియోతో.. సీఎం బీరేన్ సింగ్ గొంతు 93% వరకు మ్యాచ్ అవుతోందని ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. కేంద్రం, మణిపూర్ సర్కారు తరఫున వాదనలను వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(సీఎ్‌ఫఎ్‌సఎల్) పరిశీలన జరగాలని, మూడు వారాల గడువు కావాలని కోరారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణను మార్చి 24కు వాయిదా వేసింది.