ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. ఛైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా పట్టణంలోని జగ్జీవన్‌రామ్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యురాలు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు 18 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ క్రమంలో నిర్వహించిన ఎన్నికలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిపి కృష్ణకుమారికి 15 మంది మద్దతు లభించింది. వైకాపా అభ్యర్థి ఓర్సు లక్ష్మికి కేవలం ముగ్గురే మద్దతు తెలిపారు. దీంతో ఛైర్‌పర్సన్‌గా కృష్ణకుమారి ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ధ్రువీకరణ పత్రాన్ని ఎన్నికల ప్రత్యేకాధికారి, ఆర్డీవో బాలకృష్ణ ఆమెకు అందజేశారు.
2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా-13, తెదేపా-6, జనసేన-1 చొప్పున గెలిచారు. ఆ తర్వాత తెదేపా నుంచి ఒకరు వైకాపాలో చేరారు. ఛైర్‌పర్సన్‌గా వైకాపా నుంచి మండవ వరలక్ష్మి, వైస్‌ఛైర్‌పర్సన్‌గా మాడుగుల నాగరత్నం ఎంపికయ్యారు. ఆ తర్వాత వీరు చనిపోయారు. ప్రస్తుతం ఏడుగురు కౌన్సిలర్లు వైకాపాను వీడి తెదేపాలో చేరడంతో తెదేపా బలం 5 నుంచి 12కు పెరిగింది. జనసేనతో కలిపితే 13. ఎమ్మెల్యేతో కలిపి 14 ఓట్లు ఉన్నాయి. వైకాపాలో ఐదుగురు మిగలగా.. వీరిలో ఒకరు రాజీనామా చేయడంతో నలుగురే మిగిలారు. ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌తో కలిపి ఆ పార్టీకి ఐదు ఓట్లున్నాయి. తాజాగా జరిగిన ఛైర్‌పర్సన్ ఎన్నికలో వైకాపాకు కేవలం ముగ్గురే మద్దతు తెలపడం గమనార్హం.