చంద్రబాబుకు ఆశీర్వచనాలు పలికిన అవధాని సరస్వతీ ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ 'పద్మశ్రీ' పురష్కారం పొందిన సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చంద్రబాబుకు ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ... చంద్రబాబు కీర్తి మరింత ఇనుమడిస్తుందని, ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షం అవుతుందని చెప్పారు. ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తాయని... ఆయన ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చుతాయని అన్నారు. అమరావతి రాజధాని పూర్తై ప్రపంచంలో మేటి నగరం అవుతుందని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తై ప్రజలకు మేలు జరుగుతుందని నాగఫణి శర్మ అన్నారు. ముఖ్యమంత్రిని ఈ మేరకు ఆయన ఆశీర్వదించారు. 'పద్మశ్రీ' వచ్చిన సందర్భంగా నాగఫణి శర్మను అమరావతికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు... ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ... దేశంలో సీఎం చంద్రబాబు వంటి ముందు చూపు ఉన్న నేత మరొకరు లేరని అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు. చంద్రబాబు విజన్ వల్లనే హైదరాబాద్‌కు ఐటీ వచ్చిందని... ఆయన ముందు చూపు లక్షల మంది జీవితాల్లో వెలుగులు తెచ్చిందని అన్నారు. రాళ్లు, రప్పలతో నిండిన మాదాపూర్ ప్రాంతం భవిష్యత్‌లో ఎలా ఉండబోతుందో చంద్రబాబు 30 ఏళ్ల క్రితమే ఊహించారని నాగఫణి శర్మ అన్నారు. ఐటీ కంపెనీలతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. ఈ ప్రాంతం అంతా ఐటీ కంపెనీలతో, ఐటీ ఉద్యోగులతో నిండిపోతుంది... దేశ, విదేశాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి పనిచేస్తారు... అలాంటి ఈ ప్రాంతంలో మన సంస్కృతి, సాంప్రదాయాలు వెల్లివిరియాలి... అవధాన ప్రక్రియ బతకాలి... ప్రజలందరికీ మన కీర్తి, మన భాష, మన ఆచారాలు తెలియాలని చంద్రబాబు ఆనాడే మాకు అవధాన సరస్వతీ పీఠం ఏర్పాటుకు స్థలం మంజూరు చేశారు అని నాగఫణి శర్మ వివరించారు. పెద్ద పెద్ద ఐటీ సంస్థల మధ్యలో మన తెలుగు సంస్కృతి ఉండాలని ఆయన చేసిన ఆలోచన వల్లనే నాడు అక్కడ అవధాన సరస్వతీ పీఠం ఏర్పాటు చేసినట్లు నాగఫణి శర్మ వెల్లడించారు.