ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటఘటనపై నటి, బీజేపీ నాయకురాలు హేమా మాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం మహా కుంభమేళాలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన ఆమె.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాటలో 30 మంది మరణించడం పెద్ద విషయం కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. కావాలనే దానిని పెద్ద సమస్యగా చేసి చూపిస్తున్నారని తాను అభిప్రాయపడుతున్నట్టు పేర్కొంది. యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ అన్ని ఏర్పాట్లు బాగా చేశారని, ఆరోజు ఎక్కువమంది రావడంతో ఆ ఘటన జరిగి ఉండవచ్చని అన్నారు.కాగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా ప్రారంభం అయింది. అయితే జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది ప్రజలు తరలిరావడంతో సెక్టార్-2 లో తొక్కిసలాట జరిగి దాదాపు 30 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఎంక్వైరీ కమిషన్ వేశారు. 5 కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేయగా.. ఏకంగా 15 కోట్ల మంది భక్తులు తరలి వచ్చారని, అందువల్లే ఆ దురదృష్ట ఘటన జరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ప్రతిపక్షాలు యోగి సర్కార్ ను దుమ్మెత్తిపోస్తున్నాయి. మృతుల సంఖ్యను తగ్గించి చూపారని, మృతదేహాలను దాచారని, నదిలో పడేశారని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చనిపోయిన వారి సంఖ్య పెద్దదేమి కాదు, అలాంటప్పుడు ఎందుకు విమర్శలు చేస్తున్నారని హేమా మాలిని అనడం బీజేపీకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది