రాష్ట్ర బీజేపీలో నెలకొన్న గ్రూపు విభేదాల పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఇప్పటికే బెంగళూరు నుంచి ఎమ్మెల్యే రమేశ్ జార్కిహొళి, మాజీ ఎమ్మెల్యే కుమారబంగారప్ప, ఎన్ఆర్ సంతోష్‌లు ఢిల్లీ వెళ్లారు. మంగళవారం బసనగౌడపాటిల్ యత్నాళ్, మాజీ ఎంపీ జీఎం సిద్దేశ్వర్లు చేరుకోనున్నారు. రెండురోజులపాటు ఢిల్లీలో మకాం వేసి రాష్ట్ర పార్టీ అధ్యక్షస్థానానికి ఎన్నికలు జరపాలని అధిష్ఠానం పెద్దలతో ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇదే ప్రతిపాదనతోనే వారు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ బిజీగా ఉన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున కేంద్రమంత్రి అపాయింట్మెంట్ దొరికేదాకా అక్కడే ఉండాలని తీర్మానించారు.పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరపాలని భావిస్తున్న తరుణంలోనే 23 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలతో భేటీ కావాలని తీర్మానించారు. డిపాజిట్లు కోల్పోయే వ్యక్తులు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికలు జరిపితే ఎవరి సత్తా ఏమిటో తేలనుందని వీరు సవాల్ చేస్తున్నారు. ఢిల్లీలో ప్రధానంగా కొన్ని అంశాలను నేతలతో ప్రస్తావించాలని తీర్మానించారు.కర్ణాటకలో కుటుంబ రాజకీయాలకు బీజేపీలో స్వస్తి పలకాలని, ఇటీవల ఎన్నికల్లో ఓటమికి లోపాయకారీ ఒప్పందాలే కారణమని, వారినే కొనసాగిస్తే మనుగడ ఉండదని వివరించదలిచారు. ఇలా రాష్ట్ర బీజేపీ పంచాయితీ ఢిల్లీకి చేరింది. అయితే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు కొనసాగించరాదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలు జరిపితే పార్టీలో ఇప్పటికే గ్రూపులు ఉన్నాయని ఇది మరింత అగాథానికి కారణం కానున్నాయని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మరికొంత కాలం విజయేంద్రను అధ్యక్షుడిగా కొనసాగించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బళ్ళారి వివాదం మలుపులు తిరుగుతోంది. గదగ్‌లో శ్రీరాములు మాట్లాడుతూ కాంగ్రెస్ వారు ఆహ్వానించింది వాస్తవమేనని, నన్ను అడ్డుకునే శక్తి ఎవరికైనా ఉందా..? అని ప్రశ్నించారు. అందరినీ ఒకే గాటికి కట్టివేయడం సరికాదన్నారు. సమస్యకు పరిష్కారం ఉంటుందని, అధిష్ఠానం అందరికి గుర్తింపు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో ఏడెనిమిదిశాతం ఓట్లను ప్రభావితం చేసే నాయకులకు గౌరవం ఇవ్వాలన్నారు.