మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో బహిరంగ ప్రదేశాలలో భిక్షాటన నిషేధానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సోమవారం, భోపాల్ పరిధిలోని అన్ని బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనను పూర్తిగా నిషేధించే ఉత్తర్వులను జారీ చేశారు. కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్, భారతీయ నాగరిక సురక్ష సాహిత 2023లోని సెక్షన్ 163 కింద ఈ నిషేధ ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ సెక్షన్లో "చికాకు కలిగించే లేదా ప్రమాదం సంభవించే అత్యవసర సందర్భాల్లో ఆర్డర్ జారీ చేసే అధికారం" ఉపయోగించారు.ఈ ప్రకారం, భిక్షాటన చేసిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. జారీ చేసిన ఉత్తర్వుల్లో భిక్షాటన నిషేధం ఉల్లంఘించిన వ్యక్తిపై BNSS, 2023లోని సెక్షన్ 223 కింద కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భిక్షాటనపై పెరుగుతున్న భయంకరమైన పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్వుల ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్స్, క్రాసింగ్లు, మతపరమైన ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో భిక్షాటన చేస్తున్న వ్యక్తులు, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ధిక్కరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఆయా వ్యక్తులు భిక్షాటనను ఆయా ప్రాంతాల్లో ఆపాలని కోరారు.